భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' చిత్రానికి బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. సినిమా విడుదలకు ముందే పైరసీ భూతం నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, సినిమాను అనధికారికంగా రికార్డ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, లేదా ఏ ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో హోస్ట్ చేయడాన్ని నిషేధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం ఈ నెల‌ 5న విడుదల కానుంది.

గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరగవచ్చనే బలమైన ఆందోళనతో వారు 'ఆనంద్ అండ్ నాయక్' న్యాయ సంస్థ ద్వారా కోర్టును ఆశ్రయించారు. సినిమా స్క్రిప్ట్, పాత్రలు, ఫుటేజ్, పాటలు, రికార్డింగ్‌లతో సహా అన్ని అంశాలపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడాలని పిటిషన్‌లో కోరారు. కేవలం ఆహ్వానితుల కోసం ప్రదర్శించిన రెండు ట్రైలర్లను కొందరు రహస్యంగా రికార్డ్ చేసి డిజిటల్ నెట్‌వర్క్‌లలో వ్యాప్తి చేశారని నిర్మాతలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సినిమా మొదటి భాగాన్ని సుమారు రూ. 2,000 కోట్లతో, రెండు భాగాలను కలిపి మొత్తం రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ మాధవ్ జమ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. "నిర్మాతలకు నిజమైన, బలమైన ఆందోళనలు ఉన్నాయని ప్రాథమికంగా అర్థమవుతోంది" అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు సినిమాను పైరసీ చేయకుండా 'డైనమిక్ ఇంజంక్షన్' ఉత్తర్వులు జారీ చేసింది. 

అభ్యంతరకర లింకులు లేదా మిర్రర్ సైట్లను తమ దృష్టికి తెచ్చిన వెంటనే వాటిని బ్లాక్ చేయాలని లేదా తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీ), సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. దీనిపై గూగుల్, ఇతర సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా అభ్యంతరం చెప్పలేదు.

వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఆధారంగా నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసిన కోర్టు, అప్పటివరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.