ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి మోసమే: నిడదవోలులో చంద్రబాబు

Chandrababu slams Congress Party over Women Reservation Bill failure
  • మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం చారిత్రక తప్పిదమని సీఎం చంద్రబాబు విమర్శ
  • బిల్లు పాసయ్యే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటన
  • రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను జూన్ నాటికి తొలగిస్తామని హామీ
  • నిడదవోలులో పలు శాఖల అధికారుల పనితీరుపై ఐవీఆర్ఎస్ డేటాతో సమీక్ష
  • పోలవరం, అమరావతి, సంక్షేమ పథకాలపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన సీఎం
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును విపక్షాలు అడ్డుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని ఆయన అభివర్ణించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మహిళా రిజర్వేషన్ సాధన కోసం నిడదవోలు నుంచే ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని, ఇది దేశవ్యాప్తమవుతుందని ప్రకటించారు. మహిళలకు దక్కాల్సిన హక్కును కాలరాసిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మహిళా బిల్లుకు అడ్డుపడటం చారిత్రక తప్పిదం 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు న్యాయం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ మోసం చేస్తోందని ఆరోపించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా తాను ఉన్నప్పటి నుంచి, వాజ్‌పేయి హయాంలోనూ ఈ బిల్లును అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని గుర్తుచేశారు. 

2010లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లును ఆమోదించి, లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా మహిళలను వంచించిందని విమర్శించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో బిల్లు వస్తే, డీలిమిటేషన్ పేరుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే తప్పుడు వాదనతో అడ్డుకున్నారని మండిపడ్డారు. సీట్లు తగ్గవని కేంద్రం హామీ ఇచ్చినా, కావాలనే పక్కదారి పట్టించి మహిళలకు ద్రోహం చేశారని అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు ఎన్డీయే ప్రభుత్వం మహిళల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

స్వచ్ఛాంధ్రతో స్వర్ణాంధ్ర సాధన
 స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చిందని, దానిని శుభ్రపరిచే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 9000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని, పేరుకుపోయిన 153 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తలో ఇప్పటికే 114 లక్షల టన్నులు తొలగించామని, జూన్ నాటికి రాష్ట్రాన్ని పూర్తి పరిశుభ్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. 

చెత్త ప్రాసెసింగ్ కోసం రూ.603 కోట్లతో 107 ఆధునిక ప్లాంట్లను అక్టోబర్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. "స్వచ్ఛ రథాల" ద్వారా ఇళ్లలోని పాత వస్తువులను సేకరించి, వాటికి ధర కట్టి నిత్యావసరాలు ఇచ్చే సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

అధికారుల పనితీరుపై సీఎం సమీక్ష 
ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు తనదైన శైలిలో అధికారుల పనితీరును సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన సంతృప్తి స్థాయి డేటాను విశ్లేషిస్తూ, నిడదవోలు నియోజకవర్గంలో వివిధ శాఖల పనితీరును బహిరంగంగా వెల్లడించారు. రాష్ట్ర సగటు కంటే మెరుగైన పనితీరు కనబరిచిన జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులను అభినందించారు. 

అదే సమయంలో, ఆర్టీసీ బస్ సర్వీసులు, ఫైర్ సర్వీసెస్, రెవెన్యూ వంటి శాఖల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉండటంపై సంబంధిత అధికారులను నిలదీశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా 
ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదవాడి ఆకలి తీరుస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల లోపు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా భూములివ్వడంతో అమరావతి నిర్మాణం వేగవంతమవుతోందన్నారు. 

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి కోరిన వంతెనల నిర్మాణం, ఆసుపత్రి అభివృద్ధి, రోడ్ల విస్తరణ వంటి పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విద్వంస రాజకీయాలు చేసే పార్టీలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, రామానాయుడు, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Women Reservation Bill
TDP
Congress
BJP
NDA
INDIA Bloc
Nidadavolu

More Telugu News