కుంచాకో బోబన్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. కథాబలం .. పాత్రలలో వైవిధ్యం ఆయన సినిమాలలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఓటీటీ సినిమాల కారణంగా ఇతర భాషలలోను ఆయనను అభిమానించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'నా తాన్ కేస్ కొడు'. 2022లో విడుదలైన ఈ సినిమా, 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 24వ తేదీ నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
రాజీవ్ (కుంచాకో బోబన్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ఒకసారి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతను 'దేవి' (గాయత్రి శంకర్)కి దగ్గరవుతాడు. దొంగతనాలు మానేసి ఆమెతో కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. అతని కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. ఒకరోజు రాత్రి అతను ఎమ్మెల్యే ఇంటి ప్రహరీ గోడ దూకుతాడు. దాంతో అతణ్ణి కుక్కలు తీవ్రంగా గాయపరుస్తాయి. తమ ఇంట్లోని ముఖ్యమైన ఫైల్స్ .. డబ్బు కనిపించకుండా పోయాయని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కోర్టుకు వెళతారు.
గుడికెళ్లి ఎమ్మెల్యే ఇంటిముందు నుంచి తిరిగొస్తుండగా, తనపైకి ఆటో దూసుకొస్తుండటం చూసి .. భయంతో ప్రహరీ గోడ దూకేశానని కోర్టులో రాజీవ్ చెబుతాడు. దాంతో ఆటో డ్రైవర్ సురేశ్ ను కోర్టుకు తీసుకొస్తారు. తన ఆటోను వెనుక నుంచి పాల వ్యాన్ ఢీ కొట్టడం వలన, తన ఆటో ముందుకు దూసుకుపోయిందని అతను కోర్టుకు చెబుతాడు. వెంటనే పాల వ్యాన్ డ్రైవర్ ను కోర్టులో ప్రవేశ పెడతారు. రోడ్డుపై గుంతలు ఉండటం వలన, ఒక వ్యక్తిని తప్పించబోయి ఆటోను ఢీకొట్టినట్టు అతను ఒప్పుకుంటాడు.
జరిగిన సంఘటనకు కారణం రోడ్లపై గుంతలు ఉండటమేననీ, ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సదరు మంత్రిని కోర్టులో ప్రవేశ పెట్టవలసిందేనని రాజీవ్ పట్టుబడతాడు. ఒక మంత్రిని కోర్టుకు రప్పించవలసిందేనని ఒక సామాన్యుడు కోరడంతో, రాష్ట్రంలోని అందరి దృష్టి ఈ కేసు వైపుకు మళ్లుతుంది. ఆ తరువాత ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది? రాజీవ్ ప్రయత్నం ఫలిస్తుందా లేదా? అనేది మిగతా కథ.
ఇది ఒక చిన్న దొంగ కథ .. చిల్లర దొంగ కథ. దొంగతనాలు మానేసిన తరువాత, ఆ నేరంపై స్టేషన్ కి వెళ్లిన రాజీవ్ అనే యువకుడి కథ. ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కారణంపై స్టేషన్ కి వెళ్లిన రాజీవ్, దొంగతనం చేయాలనే ఉద్దేశం తనకిలేదని చెబుతాడు. కానీ తమ ఇంట్లో వస్తువులు పోయాయని ఎమ్మెల్యే ఫ్యామిలీ తేల్చి చెబుతుంది. తాను నిర్దోషినని నిరూపించుకోవడం కోసం ఒక సామాన్యుడు చేసిన పోరాటం, ఒక మంత్రిని ఎలా కోర్టుకు రప్పిస్తుంది? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.
చిన్న చిన్న నేరాలు చేసిన సామాన్యులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ .. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. తమ దగ్గర డబ్బులేకపోయినా .. పనులు మానుకుని మరీ వాయిదాలకు హాజరవుతూ ఉంటారు. అయితే అధికారంలో ఉన్న కొంతమంది పెద్దలు తమ నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న నేరాలకు .. ప్రమాదాలకు ఎంతమాత్రం బాధ్యత వహించకుండా కూల్ గా బ్రతికేస్తుంటారు. అలాంటివారికి ఒక సామాన్యుడు చేసే హెచ్చరికనే ఈ కథగా చెప్పుకోవాలి.
ఈ కథ ఒక 30 శాతం అవుట్ డోర్ లో నడిస్తే, మిగతా కథ కోర్టు రూమ్ లో కొనసాగుతుంది. సాధారణంగా మలయాళ కథలు చాలా సాదాసీదాగా మొదలవుతాయి. ఆ తరువాత కథ చిక్కబడుతూ వెళుతుంది. ఈ కథ కూడా చివర్లో ఏదో ట్విస్ట్ ఇస్తుందనే ఆడియన్స్ ఎదురుచూస్తారు. కానీ ఆ స్థాయి ట్విస్ట్ ఏదీ పలకరించదు. కోర్టు రూమ్ లో కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. వాదోపవాదాలు చాలా నీరసంగా కొనసాగుతూ నిరుత్సాహాన్ని కలిగిస్తాయి.
ఒక సాధారణ యువకుడు .. ఒక మంత్రిగారిని కోర్టుకు రప్పించడమనే ఒక పాయింట్ ఆసక్తిని రేకెత్తించేదే. అయితే ఆ దిశగా అల్లుకుంటూ వెళ్లిన సన్నివేశాలు అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఇక హీరో - హీరోయిన్ మధ్య లవ్ .. రొమాన్స్ కి ఛాన్స్ ఉన్నా, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. కోర్టు రూమ్ కామెడీ కూడా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమా ప్రేక్షకుడిపై పెద్దగా ప్రభావం చూపలేకపోవడానికి ప్రధానమైన కారణం, ఎమోషన్ ను కనెక్ట్ చేయలేకపోవడమేనని చెప్పుకోవాలి.
ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కూడా ఫరవాలేదు. ఎటొచ్చి కథాకథనాలలోనే సరిపడినంత బలం లేదు. మలయాళంలో ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు ఆడియన్స్ వైపు నుంచి చూసుకుంటే మాత్రం, చాలా నిదానంగా సాగిన కంటెంట్ గానే నిలిచిపోతుంది. కానీ మలయాళ సినిమాలలో కనిపించే సహజత్వం మాత్రం, ఎప్పటిలానే మార్కులు కొట్టేస్తుంది.
'నా తాన్ కేస్ కొడు' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Nna Thaan Case Kodu Review
Movie Details
Movie Name: Nna Thaan Case Kodu
Release Date: 2026-07-24
Cast: Kunchacko Boban,Gayathrie Shankar,Rajesh Madhavan,Kunhikrishnan
Director: Ratheesh Balakrishnan Poduval
Music: Dawn Vincent
Banner: STK Frames
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer