టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ కొలువును కాదని రైస్ బిజినెస్.. లక్షల్లో ఆదాయం!

Rejecting TCS Software Job for Rice Business Earning Lakhs
  • టీసీఎస్ ఉద్యోగాన్ని తిరస్కరించి బియ్యం వ్యాపారం ప్రారంభించిన యువకుడు
  • ఏడాదికి రూ. 25 లక్షలు సంపాదిస్తున్నాడంటూ స్నేహితుడి పోస్టు వైరల్
  • రైతుల నుంచి నేరుగా బియ్యం కొని సొంత బ్రాండ్‌తో అమ్మకం
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో వచ్చిన ఉద్యోగాన్ని కాదని, సొంతంగా బియ్యం వ్యాపారం ప్రారంభించిన ఓ యువకుడు ప్రస్తుతం ఏడాదికి రూ. 25 లక్షలు సంపాదిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంకిత్ పాండే అనే 'ఎక్స్' యూజర్ జూలై 24న తన స్నేహితుడి విజయగాథను నెటిజన్లతో పంచుకున్నారు.

క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో వచ్చిన టీసీఎస్ ఉద్యోగాన్ని తన స్నేహితుడు నిరాకరించినప్పుడు అందరూ అతడిని విమర్శించారని, అది జీవితంలోనే పెద్ద తప్పిదమని అన్నారని అంకిత్ తెలిపారు. అయితే, ప్రస్తుతం తన స్నేహితుడి సొంతంగా బియ్యం వ్యాపారం చేస్తూ ఏడాదికి రూ. 25 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నాడని పాండే తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యాపార విధానం ప్రకారం, సదరు యువకుడు వివిధ గ్రామాలు, రాష్ట్రాల్లోని రైతుల నుంచి నేరుగా కిలో రూ. 35 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. దీనికి ప్యాకేజింగ్‌ కోసం రూ. 3, రవాణా కోసం మరో రూ. 2 వెచ్చిస్తారు. అంటే కిలో బియ్యంపై మొత్తం రూ. 40 ఖర్చవుతుంది. అనంతరం తన సొంత బ్రాండ్‌తో ప్యాక్ చేసిన బియ్యాన్ని రిటైల్ దుకాణాలకు కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తారు. ఇలా నెలకు సుమారు 200 క్వింటాళ్ల బియ్యాన్ని దాదాపు 200 రిటైల్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విస్తృత చర్చకు దారితీసింది. ఆ యువకుడి వ్యాపార నైపుణ్యాన్ని, ధైర్యంతో కూడిన నిర్ణయాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా స్థిరమైన జీతం వచ్చే ఉద్యోగంతో పోలిస్తే, సొంత వ్యాపారంలో అనిశ్చితి, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Ankit Pandey
TCS Job Rejection
Rice Business Success
Young Entrepreneur Income
Software Job vs Business

More Telugu News