ఏనుగుకు బెల్లం.. కోపంతో వ్య‌క్తిని తొక్కి చంపేసిన గ‌జ‌రాజు.. సీసీటీవీలో రికార్డయిన భయానక‌ దృశ్యాలు!

Elephant kills man while feeding jaggery horrifying CCTV footage recorded
  • ఇండోర్‌లో ఏనుగు దాడిలో ఆటో డ్రైవర్ దుర్మరణం
  • బెల్లం తినిపిస్తుండగా అకస్మాత్తుగా దాడి చేసిన గజరాజు
  • ఘటనలో మావటికి కూడా గాయాలు, పోలీసుల అదుపులో మావటి
  • జంతువును నియంత్రించడంలో నిర్లక్ష్యంపై కేసు నమోదు
  • నగరంలోకి ఏనుగును తీసుకురావడంపై అనుమతులపై విచారణ
ఇండోర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఏనుగుకు బెల్లం తినిపిస్తున్న ఆటో డ్రైవర్‌పై అది అకస్మాత్తుగా దాడి చేసి చంపేసింది. ఈ విషాద ఘటన చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ నగర్‌లో జరిగింది. ఈ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని రాజ్ నగర్ నివాసి విజయ్ అలియాస్ లక్ష్మణ్ రావు హోల్కర్ (49)గా గుర్తించారు. ఉజ్జయిని నుంచి ఓ ఉత్సవం కోసం నగరానికి తీసుకొచ్చిన ఏనుగును దాని మావటి ఉమేశ్‌ గోస్వామి వీధుల్లో తిప్పుతూ భిక్షాటన చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ తన ఆటోను ఆపి ఏనుగుకు బెల్లం తినిపించడానికి ప్రయత్నించాడు.

అంతలోనే ఊహించని విధంగా ఏనుగు రెచ్చిపోయింది. విజయ్‌ను తొండంతో చుట్టి పైకి లేపి, గట్టిగా నేలకేసి కొట్టింది. అనంతరం అతడిపై కాలు వేసి తొక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఏనుగును అదుపు చేసే ప్రయత్నంలో మావటి గోస్వామికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే విజయ్‌ను జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో తీవ్రమైన అంతర్గత గాయాల వల్లే మరణం సంభవించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మావటి ఉమేశ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జంతువును నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించినట్లు కేసు నమోదు చేశారు. అసలు నగరంలోకి ఏనుగును తీసుకురావడానికి సరైన అనుమతులు ఉన్నాయా? లేదా? అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన అనంతరం ఏనుగును తిరిగి ఉజ్జయినికి పంపించారు. జ‌నాలు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లోకి ఏనుగులను తీసుకురావడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
Advertisement
Elephant
Indore
Vijay Laxman Rao Holkar
Elephant attack CCTV
Mahout Umesh Goswami
Jaggery feeding accident

More Telugu News