‘నా కెరీర్‌పై నిర్ణయం నాదే’.. సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sanju Samson opens up about his cricket journey and batting style
  • తన సొంత నిర్ణయాలతోనే ఆడతానన్న సంజూ
  • పోటీ రేసు నుంచి తప్పుకొన్నట్లు వెల్లడి
  • అవసరమైనప్పుడు జట్టుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని వెల్లడి
  • కోహ్లీ సూచనలు గుర్తు చేసిన వికెట్‌కీపర్
  • ఆర్చర్‌పై విమర్శలను పట్టించుకోనన్న సంజూ
భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన క్రికెట్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందే తాను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇకపై ఎవరి మాటలు పట్టించుకోకుండా, తనకు నచ్చిన విధంగానే క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. పోటీ, పోలికల పరుగులో భాగం కాబోనని స్పష్టం చేశాడు. తన ఆటపై నిర్ణయం తీసుకునేది తానేనని తేల్చి చెప్పాడు.

జియోస్టార్ ‘బిలీవ్’ కార్యక్రమంలో మాట్లాడిన సంజూ.. భారత్‌లో ఎప్పుడూ పోటీ వాతావరణమే ఉంటుందని అన్నాడు. ఆ రేసు నుంచి తాను బయటకు వచ్చానని చెప్పాడు. ‘‘ఎలా బ్యాటింగ్ చేయాలి, ఏం చేయాలి అని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. సంజూ గురించి నిర్ణయం సంజూనే తీసుకుంటాడు’’ అని వ్యాఖ్యానించాడు. జట్టుకు అవసరమైనప్పుడు పూర్తి స్థాయిలో సహకరిస్తానని, అయితే తన శైలిని మాత్రం మార్చుకోనని స్పష్టం చేశాడు. తాను సాధించిన విజయాలను ఎవరూ తీసివేయలేరని పేర్కొన్నాడు.

టీమిండియా శిబిరంలో విరాట్ కోహ్లీతో జరిగిన సంభాషణను కూడా సంజూ గుర్తు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘంగా రాణించాలంటే జీవనశైలి, ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోహ్లీ తనకు సూచించాడని తెలిపాడు. శరీరానికి ఏ ఆహారం మంచిదో, ఎలా క్రమశిక్షణ పాటించాలో వివరించాడని చెప్పాడు. ఏడాదిన్నర పాటు ఆ విధానాన్ని అనుసరించినా, తర్వాత అదే క్రమశిక్షణ కొనసాగించలేకపోయానని నిజాయతీగా అంగీకరించాడు.

టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు జోఫ్రా ఆర్చర్‌పై తన గత రికార్డును చాలామంది గుర్తు చేశారని సంజూ వెల్లడించాడు. అయితే అప్పటికే తనపై తనకు పూర్తి నమ్మకం ఏర్పడిందని చెప్పాడు. గతంలో ఉన్న సంజూ, ఇప్పుడు ఉన్న సంజూ ఒకే వ్యక్తి కాదని భావించానని తెలిపాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లో జట్టుకు ప్రధానంగా పరుగులు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని భావించానని అన్నాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో వరుస డాట్ బాల్స్ ఆడినా ఆందోళన చెందలేదని, సరైన సమయం వచ్చినప్పుడు దాడి చేయాలన్న స్పష్టతే విజయానికి కారణమైందని వివరించాడు. బుమ్రా సహా ప్రతి ఆటగాడి పాత్ర భారత్ విజయానికి కారణమైందని కొనియాడాడు.
Advertisement
Sanju Samson
Team India
Virat Kohli
T20 World Cup
Cricket Career
Indian Cricket Team

More Telugu News