తాలిబన్ల నిర్ణయంతో యూనివర్సిటీ విద్యకు మహిళల దూరం.. క్లాస్‌రూములో ఎలా రోదిస్తున్నారో చూడండి!
- గుండెలు పిండేస్తున్న వీడియో
- తాలిబన్ల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు
- ఆందోళన వ్యక్తం చేసిన భారత్
గత బుధవారం తాలిబన్ ఉన్నత విద్యాశాఖ ఓ ప్రకటన చేస్తూ యూనివర్సిటీ విద్య నుంచి మహిళలను నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు అన్నింటికీ వర్తిస్తుందని, ఇకపై ఎవరూ మహిళలను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. తాలిబన్లు ఆ ప్రకటన చేసిన వెంటనే అన్ని యూనివర్సిటీల వద్దకు తాలిబన్ సాయుధ బలగాలు మహిళలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాయి.
యూనివర్సిటీ విద్యకు మహిళలను దూరం చేస్తూ ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా విద్యకు భారత్ స్థిరంగా మద్దతు ఇస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ అందరినీ కలుపుకుని పోవాలని తాలిబన్ ప్రభుత్వానికి భారత్ సూచించింది.