వారం రోజుల పోలీసు కస్టడీకి జోసెఫ్ రావణ్.. కోర్టు కీలక ఆదేశాలు

వారం రోజుల పోలీసు కస్టడీకి జోసెఫ్ రావణ్.. కోర్టు కీలక ఆదేశాలు

Joseph Ravan sent to seven days police custody by court
  • చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించారనే ఆరోపణలు
  • రావణ్ పై యూఏపీఏ కింద కేసు నమోదు
  • రేపు కస్టడీకి తీసుకోనున్న గన్నవరం పోలీసులు

సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత వ్యాఖ్యలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్ కేసులో గన్నవరం న్యాయస్థానం ఈరోజు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసు విచారణలో భాగంగా జోసెఫ్‌ను ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపు (సెప్టెంబరు 18) ఉదయం గన్నవరం పోలీసులు అతడిని కస్టడీకి తీసుకోనున్నారు.


యువతను రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించడం, ఏలూరులో నిర్వహించిన ఓ సమావేశంలో నక్సలిజం వైపు మళ్లేలా ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఏపీ పోలీసులు ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్న సంబంధాలు, దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాల కోణంలో లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, వారం రోజుల కస్టడీకి అంగీకరించడంతో రాబోయే విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Joseph Ravan
Gannavaram Court
UAPA Case
YouTuber Joseph Ravan
Andhra Pradesh Police
Hate Speech Case

More Telugu News