జగిత్యాల జిల్లాలో అనుమానాస్పద స్థితిలో కాలువలో శవమై తేలిన బీజేపీ నాయకుడు
- జిల్లాలోని పెగడపల్లి మండలం సుద్దపల్లిలో విషాదం
- ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన రమణారెడ్డి
- ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
రమణారెడ్డి ప్రయాణిస్తున్న బ్రెజ్జా కారు ఎస్సారెస్పీ కాలువలో పడటంతో ఆయన మృతి చెందాడు. ఆయన ఇటీవల క్రిప్టో కరెన్సీతో భారీగా నష్టపోయాడు. మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన కారును ఎస్సారెస్పీ కాలువలో గుర్తించి వెలికి తీయగా అందులో రమణారెడ్డి మృతదేహాన్ని ఉంది. ప్రమాదవశాత్తు కారు అందులో పడిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన 18వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని, దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ ప్రాంతాన్ని దాటి అతను బయటకు వెళ్లినట్లుగా ఎక్కడా లేదన్నారు. దీంతో ఇదే ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు ఉదయం కాలువలో పడినట్లు గుర్తించామని అన్నారు. కారును వెలికితీయగా రమణ మృతదేహం లభ్యమైందన్నారు.