రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి అమ్మకాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీజీ సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) డ్రగ్స్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించింది.

కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు కీలక ప్రాంతాల్లో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సుమారు 90 మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ట్రామడాల్, అల్ప్రాజోలం, కోడైన్ సిరప్‌ల వంటి మత్తు కలిగించే ఔషధాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని, నిబంధనల తీవ్రతను బట్టి లైసెన్సులను సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబొర్రు గ్రామంలో అర్హత లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న షేక్ మస్తాన్ వలీ అనే నకిలీ వైద్యుడి వ్యవహారాన్ని అధికారులు బట్టబయలు చేశారు. సదరు క్లినిక్‌పై దాడి చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 42 వేల విలువైన 34 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ మందులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడటంపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ విక్రయించడం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సమస్య తీవ్రమవుతుందని, అలాగే స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.