పాత ఇల్లు కొనేముందు జాగ్రత్త.. ఈ 7 విషయాలు మిస్‌ అయితే చిక్కుల్లో పడతారు!

పాత ఇల్లు కొనేముందు జాగ్రత్త.. ఈ 7 విషయాలు మిస్‌ అయితే చిక్కుల్లో పడతారు!

Buying an Old House be careful and check these 7 things to avoid trouble
  • ముందుగా యాజమాన్య పత్రాలు చెక్‌ చేయాలి
  • ఇంటిపై అప్పులు, వివాదాలు ఉన్నాయా చూడాలి
  • పాత బకాయిల వివరాలు తెలుసుకోవాలి
  • ఇంటి నిర్మాణ పరిస్థితిని పరిశీలించాలి
  • సేల్‌ అగ్రిమెంట్‌ను పూర్తిగా చదవాలి
సొంత ఇల్లు కొనడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి. కొత్తగా నిర్మించిన ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ముందే స్పష్టంగా ఉంటాయి. కానీ రీ-సేల్‌ ఇల్లు విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆ ఇంటి యజమాన్యం విషయంలో వివాదాలు ఉండొచ్చు. అప్పులు, బకాయిలు, అనుమతులు తీసుకోకుండానే మార్పులు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఏర్పడిన కాలనీ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంటిని స్వయంగా పరిశీలించే అవకాశం రీ-సేల్‌ ఇంటికి ఉన్న ప్రయోజనాలు. అందుకే అడ్వాన్స్‌ ఇచ్చే ముందు ఈ 7 అంశాలను తప్పకుండా పరిశీలించాలి.

1. ఇంటి పత్రాలు సరిగ్గా ఉన్నాయా?
ముందుగా ఇంటి టైటిల్‌ డీడ్‌, గత యాజమాన్య పత్రాలు, రిజిస్ట్రేషన్‌ వివరాలను పరిశీలించాలి. ఇంటిని అమ్ముతున్న వ్యక్తే చట్టబద్ధమైన యజమానా? పత్రాల్లో ఉన్న వివరాలు పరస్పరం సరిపోతున్నాయా? అన్నది నిర్ధారించుకోవాలి. ఇంటిపై బ్యాంకు రుణం, కోర్టు వివాదం, ఇతరుల హక్కు లేదా బకాయి ఉందా? అన్నదీ తెలుసుకోవాలి. అవసరమైతే ప్రాపర్టీ న్యాయ నిపుణుడి సాయం తీసుకోవడం మంచిది.

2. బకాయిలు ఏమైనా ఉన్నాయా?
ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు, మెయింటెనెన్స్‌ ఛార్జీల వంటి బకాయిలు ఉన్నాయా? అని చెక్‌ చేయాలి. అపార్ట్‌మెంట్‌ అయితే సొసైటీ లేదా అసోసియేషన్‌ను సంప్రదించి మెయింటెనెన్స్‌ బకాయిలు, ఇతర చెల్లింపుల వివరాలు తెలుసుకోవాలి. పాత బకాయిలు కొత్త యజమానిపై పడకుండా ముందే స్పష్టత తెచ్చుకోవాలి.

3. ఇంటి పరిస్థితి ఎలా ఉంది?
ఇల్లు చూసేటప్పుడు పెయింట్‌, ఫర్నిచర్‌ చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవద్దు. గోడల్లో తేమ, నీటి లీకేజీలు, పగుళ్లు ఉన్నాయా? ప్లంబింగ్‌, విద్యుత్‌ వ్యవస్థ సరిగా పనిచేస్తున్నాయా? అని పరిశీలించాలి. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్‌, బాత్‌రూమ్‌, కిచెన్‌ ఫిట్టింగ్స్‌ను కూడా చెక్‌ చేయాలి. ఇంటితో పాటు వస్తాయని చెబుతున్న వస్తువులు ఒప్పందంలో ఉన్నాయో? లేదో? చూడాలి.

4. అనుమతులు తీసుకొనే మార్పులు చేశారా?
గత యజమాని ఇంట్లో ఏమైనా నిర్మాణ మార్పులు చేశారా? గోడలు తొలగించారా? బాల్కనీని మూసివేశారా? అదనపు నిర్మాణం చేపట్టారా? అన్నది తెలుసుకోవాలి. ఇలాంటి మార్పులకు స్థానిక సంస్థ లేదా సొసైటీ అనుమతి అవసరమై ఉండొచ్చు. ప్రధాన మార్పులకు సంబంధించిన అనుమతి పత్రాలను తప్పకుండా పరిశీలించాలి.

5. సేల్‌ అగ్రిమెంట్‌ను పూర్తిగా చదవాలి
మాటలపై ఆధారపడి ఇల్లు కొనుగోలు చేయడం మంచిది కాదు. ఒప్పందంలో ఇంటి ధర, చెల్లింపు విధానం, స్వాధీన తేదీ, ఇంటితో పాటు వచ్చే ఫిట్టింగ్స్‌, ఇరువర్గాల బాధ్యతలు స్పష్టంగా ఉండాలి. ప్రతి క్లాజ్‌ను చదివిన తర్వాతే సంతకం చేయాలి. అర్థం కాని అంశాలు ఉంటే న్యాయ నిపుణుడిని సంప్రదించాలి.

6. భవనం, పరిసరాలను కూడా చూడాలి
ఇల్లు బాగుంటే సరిపోదు. అపార్ట్‌మెంట్‌ అయితే భవనం వయసు, నిర్వహణ, లిఫ్ట్‌లు, పార్కింగ్‌, నీటి సరఫరా, సెక్యూరిటీ, కామన్‌ ఏరియాలను పరిశీలించాలి. పరిసర ప్రాంతాన్ని ఉదయం, సాయంత్రం, రాత్రి వేర్వేరు సమయాల్లో చూడటం మంచిది. ట్రాఫిక్‌, శబ్దం, పార్కింగ్‌, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.

7. మొత్తం ఖర్చు ఎంతవుతుందో లెక్కించాలి
ఇంటి ధర ఒక్కటే ఖర్చు కాదు. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, బ్రోకరేజ్‌, న్యాయ సేవల ఖర్చు, మరమ్మతులు, ఇంటి మార్పులు, తరలింపు ఖర్చుల వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. సొసైటీ ఛార్జీలు లేదా వర్తించే ఇతర పన్నులు ఉంటే వాటినీ పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం ఖర్చు ముందే అంచనా వేస్తే బడ్జెట్‌పై స్పష్టత వస్తుంది.

రీ-సేల్‌ ఇంటి విషయంలో ధర నచ్చిందని వెంటనే అడ్వాన్స్‌ ఇవ్వడం కంటే.. పత్రాలు, బకాయిలు, ఇంటి పరిస్థితి, అనుమతులు, ఒప్పందం అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
Advertisement
Buying an Old House
Resale Property Checklist
Property Document Verification
Home Buying Tips
Real Estate Investment
Property Arrears Check

More Telugu News