ఉత్పాదకత పెంచుకోవడానికి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు చూస్తున్నాయి. అయితే, ఈ టెక్నాలజీ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఇదే విషయంపై స్పందించారు. తన ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోని ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్‌కు వస్తున్న ఆదాయం కంటే నిర్వహణ ఖర్చే ఎక్కువగా ఉందని ఆయన అంగీకరించారు.

ఎక్స్‌లోని ప్రీమియం యూజర్లు కొందరు, తమ వారపు గ్రోక్ వినియోగ పరిమితి వేగంగా అయిపోతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన ఒక యూజర్, ఈ లిమిట్‌ను రీసెట్ చేయాలని మస్క్‌ను కోరారు. ఈ నేపథ్యంలోనే మస్క్ పైవిధంగా స్పందించారు. సర్వర్ ఖర్చులు మరింత పెరగకుండా ఉండేందుకే వినియోగంపై కఠినమైన పరిమితులు విధించాల్సి వస్తోందని ఆయన వివరించారు.

మరోవైపు, ఏఐ కోసం టెక్ కంపెనీలు చేస్తున్న అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా వంటి దిగ్గజ సంస్థల మొత్తం అప్పు 2026 మధ్య నాటికి 578 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.54 లక్షల కోట్లు) చేరుకుందని తెలిపింది. 2025లో ఈ అప్పు 399 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఏఐ టెక్నాలజీ అభివృద్ధి, నిర్వహణ ఎంత ఖర్చుతో కూడుకున్నదో స్పష్టం చేస్తోంది.