ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్న వేళ.. మరో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. ఉద్యోగులను నేరుగా తొలగించకుండా స్వచ్ఛందంగా సంస్థ నుంచి వైదొలిగే అవకాశాన్ని కల్పిస్తున్నాయి దిగ్గజ కంపెనీలు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ ఈ విధానాన్ని అనుసరిస్తుండగా.. తాజాగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా కూడా ఆ జాబితాలో చేరినట్లు సమాచారం.

ఫ్రాన్స్‌లోని తమ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ పథకాన్ని మెటా ప్రతిపాదించినట్లు ఫ్రెంచ్‌ మీడియా సంస్థ ‘లా లెటర్‌’ వెల్లడించింది. ఫ్రాన్స్‌లో మెటాకు ప్రస్తుతం సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ పథకం అమలైతే దాదాపు 100 మంది వరకు సంస్థను వీడే అవకాశం ఉందని కథనం పేర్కొంది. అయితే ఏ విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం పడుతుందన్నది ఇంకా స్పష్టత రాలేదు.

మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ పథకాలకు భిన్నంగా మెటా ప్రతిపాదన ఉందని సమాచారం. ఫ్రాన్స్‌లోని కార్మిక చట్టాల ప్రకారం 'కలెక్టివ్‌ కాంట్రాక్చువల్‌ టెర్మినేషన్‌' (ఆర్‌సీసీ) విధానంలో ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా కంపెనీ, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిపి పరస్పర అంగీకారంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటారు. ఈ పథకంలో చేరాలనుకునే ఉద్యోగులు నవంబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.

ఈ పథకం కింద ఉద్యోగులకు ఆకర్షణీయమైన పరిహారం అందించే ప్రతిపాదనను మెటా ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఉద్యోగి సంస్థలో పనిచేసిన ప్రతి ఏడాదికి 2.15 నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని చెల్లించనుంది. దీంతోపాటు పది నెలల పాటు మొబిలిటీ లీవ్‌ కల్పించి.. ఆ సమయంలో స్థూల వేతనంలో 80 శాతం చెల్లించేలా ప్రతిపాదించినట్లు కథనం పేర్కొంది. ఉద్యోగులకు వృత్తిపరమైన నైపుణ్యాల శిక్షణ, సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు కూడా సహకారం అందించే అంశాన్ని మెటా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఈ ప్రతిపాదనపై జులై నుంచి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఫ్రాన్స్‌లో మెటా గతంలోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించింది. 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పట్లో సుమారు 350 మంది ఉద్యోగులున్న సంస్థలో 88 మంది వైదొలిగే అవకాశం ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా మెటాలో సుమారు 66 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫ్రాన్స్‌లో ప్రతిపాదించిన పథకాన్ని ఇతర దేశాల్లోనూ అమలు చేస్తుందా? అన్నది ఇంకా తెలియరాలేదు. మరోవైపు గూగుల్‌ ఐదు దేశాల్లో ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశాలు కల్పించగా.. మైక్రోసాఫ్ట్‌ అమెరికా, కెనడా, భారత్‌, బ్రిటన్‌లోని 60 వేల మంది అర్హులైన ఉద్యోగుల కోసం బైఅవుట్‌ పథకాన్ని ప్రకటించింది.

మెటా కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా 8 వేల ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించింది. ఇది అప్పటి మొత్తం ఉద్యోగుల్లో 10 శాతానికి సమానం. మే నెలలో మరో 7 వేల మంది ఉద్యోగులను ఏఐకి సంబంధించిన విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఏఐ సాయంతో గతంలో పెద్ద బృందాలు చేయాల్సిన పనులను ఇప్పుడు ఒక్క ఉద్యోగే పూర్తి చేయగలుగుతున్నారని సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ గతంలో పేర్కొన్నారు.

2026లో డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, డేటా కేంద్రాల కోసం మెటా 135 నుంచి 145 బిలియన్‌ డాలర్ల వరకు మూలధన వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న టెక్‌ దిగ్గజాలు.. అదే సమయంలో ఉద్యోగుల సంఖ్యను, పని విధానాలను పునర్వ్యవస్థీకరిస్తుండటం గమనార్హం.