క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ తన అంబులెన్స్‌ సేవల్లో కీలక మార్పు చేసింది. అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు అందించే అంబులెన్స్‌ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని ప్రకటించింది. అయితే అత్యవసరం కాని ప్రయాణాలకు ఇకపై రూ.2,500 ఫ్లాట్‌ ఫీజు వసూలు చేయనుంది. అంబులెన్స్‌లు సాధారణ అవసరాలకు కాకుండా.. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ గురువారం ఈ మార్పును ప్రకటించారు. డాక్టర్‌ సంప్రదింపులు, సాధారణ వైద్య పరీక్షలు, ఆసుపత్రికి వెళ్లడం, ఆసుపత్రి నుంచి ఇంటికి రావడం వంటి అత్యవసరం కాని అవసరాలకు కూడా అంబులెన్స్‌లను వినియోగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రయాణాలకు సాధారణ వాహనాలు లేదా ప్రైవేటు రవాణా సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో బ్లింకిట్‌ అంబులెన్స్‌ సేవల ద్వారా మొత్తం 42 వేల కేసులకు స్పందించామని గోయల్‌ వెల్లడించారు. వీటిలో దాదాపు 20 వేల అత్యవసర కేసులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఏ ఒక్కరి నుంచీ ఎలాంటి ఛార్జీ వసూలు చేయలేదని, అత్యవసర సేవలను భవిష్యత్తులోనూ ఉచితంగానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అయితే, రోగులకు సంబంధించి అన్ని రకాల ప్రయాణాలకు ఉచిత సేవ అందుబాటులో ఉండటంతో సాధారణ అవసరాల కోసం అంబులెన్స్‌ బుకింగ్‌లు పెరుగుతున్నాయని సంస్థ గుర్తించింది. ఇలాంటి బుకింగ్‌ల వల్ల వైద్య సిబ్బంది, అత్యవసర పరికరాలతో సిద్ధంగా ఉండే అంబులెన్స్‌లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి అందుబాటులో లేకుండా పోతున్నాయని గోయల్‌ వివరించారు.

కొత్త విధానం ప్రకారం అత్యవసర తరలింపులకు ఎలాంటి రుసుము ఉండదు. అత్యవసరం కాని ప్రయాణాలకు మాత్రం సేవ పూర్తయిన తర్వాత రూ.2,500 చెల్లించాలి. ప్రైవేటు అంబులెన్స్‌లు వసూలు చేసే ఛార్జీలకు దగ్గరగానే ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు గోయల్‌ తెలిపారు. ఈ రూపంలో వచ్చే ఆదాయాన్ని ఎటర్నల్‌ ఫౌండేషన్‌కు అందజేస్తామని, అంబులెన్స్‌ సేవల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు.

పది నిమిషాల్లో అంబులెన్స్‌ అందించే సేవలు వేలాది ప్రాణాలను కాపాడగలవని, అందుకే వాటిని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని గోయల్‌ పేర్కొన్నారు.