అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారత రూపాయి వరుసగా ఐదో రోజు కూడా లాభపడింది. అదే సమయంలో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి 94.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిన్న‌ ముగింపు ధర 94.64గా ఉంది. 

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నాలుగో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 1.16 డాలర్లు తగ్గి 93.46 డాలర్లకు చేరింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డ‌బ్ల్యూటీఐ) ధర కూడా 1.47 డాలర్లు పడిపోయి 86.65 డాలర్ల వద్ద నిలిచింది. ఈ వారంలో ఇప్పటివరకు చమురు ధరలు దాదాపు 16 శాతం మేర తగ్గడం గమనార్హం.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ డెమోక్రాట్లు విజయం సాధించడంతో ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్ దూకుడుకు కళ్లెం పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్లకుండా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ట్రంప్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడి చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్వయంగా ట్రంప్ ప్రకటించడం కూడా మార్కెట్లకు ఊరటనిచ్చింది.

ఈ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా లాభపడి 78,910 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 24,378 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి.