టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెల్లింగ్టన్‌లోని సెల్లో బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించి కివీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 135 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ 7 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ, పాంటింగ్ ఇద్దరూ న్యూజిలాండ్‌పై 1,971 పరుగులతో సమంగా ఉన్నారు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే బౌండరీ బాదిన కోహ్లీ, పాంటింగ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఈ మైలురాయిని 51 మ్యాచ్‌ల్లోని 50 ఇన్నింగ్స్‌లలో చేరుకోగా, విరాట్ కోహ్లీ కేవలం 38 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. పాంటింగ్ కివీస్‌పై 45.83 సగటుతో 6 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

ప్రస్తుతం కోహ్లీ 1,978 పరుగులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్‌పై 2,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచే సువర్ణావకాశం కోహ్లీ ముందుంది. కివీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, పాంటింగ్ తర్వాత సచిన్ టెండూల్కర్ (1,750), కుమార్ సంగక్కర (1,568), సనత్ జయసూర్య (1,519) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. తన ఐపీఎల్ జట్టు ఆర్సీబీ సహచరుడైన జాకబ్ డఫ్ఫీ బౌలింగ్‌లో కవర్ పాయింట్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదే సిరీస్‌లోని తొలి వన్డేలో, వన్డే ఫార్మాట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.