టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి బాలీవుడ్ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుష్క సేన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను ధోనీని ప్రేమగా ‘మాహీ చాచూ’ అని పిలుస్తానని ఆమె తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పదేళ్ల క్రితం ధోనితో ఏర్పడిన పరిచయం, కలిసి పనిచేసిన అనుభవాలను ఆమె గుర్తుచేసుకుంది.

సుమారు పదేళ్ల క్రితం ధోనీని మొదటిసారి కలిశానని అనుష్క చెప్పింది. ఇద్దరి స్వస్థలం రాంచీ కావడంతో వెంటనే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ఆమె వెల్లడించింది. "మీరు రాంచీ వారే కదా, నేను కూడా అక్కడి నుంచే వచ్చాను" అని తాను చెప్పగానే ధోని ఎంతో సంతోషించారని ఆమె పేర్కొంది. ఆ తర్వాత తమ మధ్య పరిచయం బలపడిందని తెలిపింది.

ధోనితో కలిసి తాను ఏడేళ్ల పాటు పనిచేశానని, ఈ సమయంలో ఇద్దరూ కలిసి 21 ప్రకటనలలో నటించామని అనుష్క వివరించింది. షూటింగ్ సెట్‌కు రాగానే ధోని తనను ‘చిక్కీ’ అని పిలిచేవారని, తాను మాత్రం ఆయన్ను ‘మాహీ చాచూ’ అని సంబోధించేదాన్నని చెప్పింది. తమ మధ్య నటీనటుల సంబంధం కంటే, ఒక కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆత్మీయత ఉందని ఆమె స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క సేన్‌కు 3.7 కోట్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.