భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన క్షణమది. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీ నుంచి చొక్కా విప్పి గిరగిరా తిప్పిన దృశ్యం అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ చారిత్రాత్మక షర్ట్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం ముంబై క్రికెట్ అభిమానులకు లభించనుంది. ముంబైలోని ఎంసీఏ శరద్ పవార్ క్రికెట్ మ్యూజియంలో ఈ షర్ట్‌ను ప్రత్యేక ప్రదర్శనకు ఉంచనున్నారు.

మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సంయుక్తంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాయి. గంగూలీ షర్ట్‌తో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ వన్డే జంపర్, ఎంఎస్ ధోనీ వన్డే షర్ట్, రాహుల్ ద్రావిడ్ టెస్ట్ షర్ట్, అనిల్ కుంబ్లే వన్డే క్యాప్ వంటి అపురూప వస్తువులను కూడా ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. ఈ నెల 14, 15, 17 తేదీల్లో ప్రజలు వీటిని వీక్షించవచ్చు. లార్డ్స్‌లోని ఎంసీసీ మ్యూజియంలో భద్రపరిచిన ఈ అమూల్యమైన వస్తువులను ముంబై అభిమానుల కోసం ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

ఈ ప్రదర్శనపై ఎంసీసీ ప్రతినిధి మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా మా సేకరణలను అభివృద్ధి చేస్తున్నాం. క్రికెట్‌కు కేంద్రమైన ముంబైలో మా అమూల్యమైన వస్తువులను ప్రదర్శించడం సంతోషంగా ఉంది" అని తెలిపారు.

ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ మాట్లాడుతూ.. "ఈ ప్రదర్శన కోసం ఎంసీసీతో భాగస్వామ్యం కావడం గౌరవంగా ఉంది. ముంబైలోని క్రికెట్ అభిమానులకు ఆట చరిత్రతో లోతైన అనుబంధం ఉంది. ఈ ప్రదర్శన వారికి గొప్ప అనుభూతిని ఇస్తుంది. భవిష్యత్ తరాల కోసం క్రికెట్ వారసత్వాన్ని కాపాడే మా ప్రయత్నాలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది" అని వివరించారు. ఈ ప్రదర్శన ద్వారా ఎంసీఏ మ్యూజియంను క్రికెట్ ప్రేమికులకు ప్రధాన ఆకర్షణగా మార్చాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.