స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే, వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.

నెల్లూరులో ఆయన మాట్లాడుతూ... ఓసీకి కేటాయించిన మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడమే టీడీపీ నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో నామినేషన్ల సమయంలోనే అభ్యర్థులను బెదిరింపులకు గురి చేశారని... ఇప్పుడు సక్రమంగా ఎన్నికలు జరుగుతుంటే ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. ఆత్మకూరులో 10 వార్డులు వైసీపీ గెలుచుకున్నా తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. 

అనంతసాగరం పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి వందమంది అనుచరులతో వచ్చి బూత్ క్యాప్చరింగ్‌కు ప్రయత్నించారని, దొంగ ఓట్లు వేయించారని సంచలన ఆరోపణలు చేశారు. దొంగ ఓట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డిని ఉద్దేశించి ఆనం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దని, సుప్రీంకోర్టుకు లాగుతాననే బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంయమనంతో వ్యవహరిస్తున్నానని, తన సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఆయన గట్టిగా హెచ్చరించారు.