వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలకు పోటీ చేసే సత్తా లేకనే, నామినేషన్లలో తప్పులు దొర్లేలా చేసి పోటీ నుంచి పారిపోయారని రవిచంద్ర ఆరోపించారు. కూటమి పార్టీలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలు విశ్వసించి స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కన్నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి మరింత మెరుగైన ఫలితాలు సాధించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో 'వన్ మినిట్ వీడియో'ల పేరుతో వైసీపీ విష ప్రచారం చేస్తోందని బీద రవిచంద్ర మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణపై ఆరోపణలు చేసినా ఆయా డివిజన్లలో గెలిచింది ఎవరని ప్రశ్నించారు. పెట్రోల్ బాంబులు వేసింది, కత్తులతో తరిమింది ఎవరు? అంటూ నిలదీశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన కారుతో టీడీపీ కార్యకర్తలను చంపేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ చెబుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే కూటమి నాయకత్వంపై విశ్వాసం ఉంచారని బీద రవిచంద్ర పేర్కొన్నారు.