తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని నిందితుల్లో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు కొట్టివేసింది. ప్రస్తుత దశలో కేసును బదిలీ చేయాల్సినంత బలమైన కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త, మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ఎండీ మచీంద్ర శాంతారాం లంకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ కేసుపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల నిష్పక్షపాత విచారణకు ప్రతికూల వాతావరణం ఉందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్... "మా ఆదేశాలతో వారందరినీ మౌనంగా ఉండేలా చేశాం. ఏదైనా జరిగితే మీరు మా వద్దకు రావచ్చు" అని వ్యాఖ్యానించారు. తాము గతంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు బదిలీకి తగిన కారణాలు లేవని పేర్కొంటూ, పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో ఈ కేసు విచారణ ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగనుంది.