ప్రకాశం జిల్లా కొత్తపట్నం సమీపంలో తమిళనాడు మత్స్యకారుల బోటు బోల్తాపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వెంటనే ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్ 3వ తేదీన 'మురసు' తుపాను కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తమిళనాడుకు చెందిన ఈ బోటు సముద్రంలో బోల్తా పడింది. మొత్తం 9 మంది ప్రయాణిస్తున్న ఈ బోటులో ఏడుగురు మత్స్యకారులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మృతదేహాలు కొత్తపట్నం తీరానికి కొట్టుకువచ్చాయి.

ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు... గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ పోలీసులు, స్థానిక మత్స్యకారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోస్టుమార్టం ప్రక్రియను వేగంగా పూర్తిచేసి, మృతదేహాలను తమిళనాడులోని వారి స్వస్థలాలకు పంపేందుకు అక్కడి అధికారులతో కలిసి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

ఈ దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా విచారం వ్యక్తం చేశారు. తుపాను వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.