అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య తలెత్తిన వివాదం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల వ్యవహారశైలిపై సమగ్ర నివేదిక రూపొందించి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు గాంధీ భవన్‌కు రావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరు నేతలను ఆదేశించారు. గురువారం ఉదయం మంత్రితో, మధ్యాహ్నం ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే సమావేశానికి వస్తానని ముందుగా చెప్పిన దామోదర రాజనర్సింహ చివరి నిమిషంలో రాలేనని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అసహనానికి గురైన పీసీసీ చీఫ్.. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరగాల్సిన భేటీని కూడా రద్దు చేసుకుని వెనుదిరిగినట్లు సమాచారం. పార్టీ పిలుపునకు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ వివాదానికి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి నియామకమే కారణమని ప్రచారం జరుగుతోంది. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తన స్వస్థలమైన నారాయణఖేడ్‌కు చెందిన నేతకు డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో మద్దతు తెలిపినట్లు సమాచారం. పక్క జిల్లా ఎమ్మెల్యే అయి ఉండి తన జిల్లాలో రాజకీయ జోక్యం చేసుకోవడంపై మంత్రి దామోదర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ‘చలో ఢిల్లీ’ ర్యాలీ సందర్భంగా ఓ ప్రముఖ హోటల్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది. మంత్రి దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఆ వర్గం పేర్కొంది. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా గాంధీ భవన్‌లో సమావేశానికి మంత్రి హాజరుకాకపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ పరిణామాలపై మహేశ్ కుమార్ గౌడ్ నివేదికను అధిష్ఠానానికి పంపనున్నట్లు సమాచారం.