నితేశ్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా నిర్మించిన భారీ చిత్రం ‘రామాయణ’పై ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా ఉందని కొనియాడాడు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. అద్భుతమైన అనుభూతి అని అభివర్ణించాడు.

ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా అట్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అద్భుతమైన ఆలోచన, తెరకెక్కించిన తీరు, గొప్ప సినిమాటిక్‌ అనుభూతి.. ఇవన్నీ ‘రామాయణ’లో ఉన్నాయని పేర్కొన్నాడు. భారతీయ సంస్కృతి, భావోద్వేగాలకు ఎంతో దగ్గరగా ఉందని అన్నాడు. తరతరాలుగా ప్రేక్షకులు గుర్తుంచుకునే చిత్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. తన పిల్లలతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నానని, కుటుంబంతో ఆస్వాదించాలని ఉందని తెలిపాడు.

సినిమాలో నటీనటుల ప్రదర్శనలపైనా అట్లీ ప్రశంసలు కురిపించాడు. రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, శోభనతో పాటు చిత్రబృందం నటన తనకు ఎంతో నచ్చిందన్నాడు. సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్‌, హన్స్‌ జిమ్మర్‌ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నాడు. అద్భుతమైన విజువల్స్‌ అందించిన డీఎన్‌ఈజీ సంస్థతో పాటు సాంకేతిక బృందాన్ని అభినందించాడు.

నిర్మాత నమిత్‌ మల్హోత్రా దూరదృష్టిని, దర్శకుడు నితేశ్‌ తివారీ కృషిని అట్లీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. వారి కష్టం, అంకితభావం భారతీయ సినిమాకు గర్వకారణమని అన్నాడు. కథను అందంగా మలిచిన స్క్రీన్‌ప్లే రచయిత శ్రీధర్‌ రాఘవన్‌కు కూడా అభినందనలు తెలిపాడు.

భారతీయ కథలు, సంస్కృతి, భావోద్వేగాలను ప్రపంచ ప్రేక్షకులకు గొప్ప స్థాయిలో అందించగల సత్తా మన సినిమాకు ఉందని అట్లీ పేర్కొన్నాడు. ‘రామాయణ’ను ప్రపంచం మొత్తం ఆదరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమా తన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతూ.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.