మురసు తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను పరిస్థితులపై అధికారులతో చర్చించి, యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

మురసు తుపాను కారణంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ అధికారులకు వివరించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే హెచ్చరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాగులు, వంకల వద్దకు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు.

తుపాను అనంతరం తాగునీరు, విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, మురసు తుపాను తీవ్ర తుఫానుగా మారి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.