పులివెందుల పులి అని గొప్పలు చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇది జగన్ రాజకీయ పిరికితనానికి నిదర్శనమని, ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకే ఎన్నికల ప్రక్రియను వివాదాస్పదం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు.

ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి, కనీసం తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకపోవడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోవడం చేతకాక, హింసాత్మక వాతావరణం సృష్టించి లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. మహిళలు, వృద్ధులు స్వేచ్ఛగా ఓటు వేయడానికి వస్తుంటే వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు, బెదిరింపులతో భయోత్పాతానికి పాల్పడుతున్నాయని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పులివెందుల జగన్ కుటుంబానికి రాజకీయ జాగీరు కాదని, అక్కడి ప్రజలు ఎవరికీ బానిసలు కారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు పొందే రోజులు పోయాయన్నారు. ఓటు వేయడానికి వచ్చి, అది కూడా చేయకుండా వెనుదిరిగిన వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.