దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే అక్టోబర్‌లో 22.9 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు దిగుమతులపై పన్ను ఆదాయం పెరగడం ఇందుకు దోహదం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

గతేడాది అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.88 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించగా నికర ఆదాయం 25.6 శాతం పెరిగి రూ.2.03 లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే నెలలో ఇది రూ.1.61 లక్షల కోట్లుగా ఉంది.

దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 15.8 శాతం పెరిగి రూ.1.59 లక్షల కోట్లకు చేరింది. దిగుమతులపై పన్ను వసూళ్లు మాత్రం 42.2 శాతం దూసుకెళ్లి రూ.72,246 కోట్లకు చేరాయి. గతేడాది అక్టోబర్‌లో దిగుమతులపై ఐజీఎస్టీ వసూళ్లు రూ.50,796 కోట్లుగా ఉన్నాయి.

ఏడు నెలల్లో రూ.14.77 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు 13.2 శాతం పెరిగి రూ.14.77 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి రూ.13.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నికర వసూళ్లు సైతం 12.6 శాతం వృద్ధితో రూ.12.69 లక్షల కోట్లకు చేరాయి.

అక్టోబర్‌లో పన్ను రిఫండ్లు 6.5 శాతం పెరిగి రూ.27,934 కోట్లకు చేరాయి. దేశీయ రిఫండ్లు రూ.14,007 కోట్లు కాగా, ఎగుమతులకు సంబంధించిన రిఫండ్లు రూ.13,927 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య మొత్తం రిఫండ్లు 16.9 శాతం పెరిగి రూ.2.08 లక్షల కోట్లకు చేరాయి.