సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు దక్కాల్సిన గౌరవం కాంగ్రెస్‌ పాలనలో లభించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఆయనను పక్కనపెట్టి, ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిపేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం ప్రయత్నించిందని ఆరోపించారు. పటేల్‌ 151వ జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘ఏక్తా రన్‌’ కార్యక్రమంలో అమిత్‌ షా మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సర్దార్‌ పటేల్‌ స్మారకంగా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహమైన ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ని నిర్మించారని షా గుర్తుచేశారు. ఈ స్మారక నిర్మాణం ద్వారా పటేల్‌ సేవలు, ఆయన వ్యక్తిత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేశారని పేర్కొన్నారు.

దేశ సమైక్యతకు పటేల్‌ చేసిన కృషిని అమిత్‌ షా ప్రస్తావించారు. కేవలం 1,218 రోజుల్లోనే ఆయన అవిభాజ్య భారతదేశ నిర్మాణానికి పునాది వేశారని అన్నారు. పలువురు నాయకులు కలిసి జీవితకాలంలో సాధించలేని పనులను పటేల్‌ తక్కువ సమయంలోనే పూర్తి చేశారని వ్యాఖ్యానించారు.

దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని షా పిలుపునిచ్చారు. 2029 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌ను పూర్తిగా డ్రగ్స్‌ రహిత దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ‘నషా ముక్త్‌ భారత్‌’ సాధనతోనే ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం దిశగా ముందడుగు వేయగలమని అన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజం నిర్మూలన దిశగా దేశం పురోగతి సాధించిందని పేర్కొన్నారు.

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటేల్‌ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు షా చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయిలో భారత్‌లో విలీనమైందని, నక్సలిజం నిర్మూలనకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు.