ముంబైలో మళ్లీ అండర్‌వరల్డ్‌ ఆధిపత్య పోరు మొదలైందా? బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక వివరాలు లభించినట్లు తెలుస్తోంది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ముంబైలో తన పట్టును పెంచుకునేందుకు, ఒకప్పుడు దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ సృష్టించిన భయాన్ని మళ్లీ నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వసూళ్ల కోసమే భయపెట్టే వ్యూహం?
ముంబైలో ఏకచ్ఛత్రాధిపత్యం సాధించడమే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ లక్ష్యంగా కనిపిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. 1990లలో అండర్‌వరల్డ్‌ ముఠాల పేరు చెబితేనే వ్యాపారవేత్తలు, బిల్డర్లు, సినీ ప్రముఖులు భయపడేవారు. అలాంటి పరిస్థితులను మళ్లీ సృష్టించాలని గ్యాంగ్‌ భావిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నట్లు భావిస్తున్నారు.

12 మంది అరెస్టు
టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక ఆడియో క్లిప్పులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటిలో అండర్‌వరల్డ్‌కు చెందిన వ్యక్తుల ప్రస్తావనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రికార్డింగులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. వాటి ద్వారా గ్యాంగ్‌ నెట్‌వర్క్‌, ఘటన వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

పాత ముఠాలకు సవాల్‌?
ముంబైలో ఇప్పటికే ఉన్న నేర ముఠాల ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తన పరిధిని విస్తరించుకోవాలని చూస్తోందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు కూడా నగరంలో భయాన్ని వ్యాప్తి చేసే విస్తృత వ్యూహంలో భాగమా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, మరిన్ని నేరాలు జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.