ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గ్రూప్‌ చాట్స్‌ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది. గ్రూప్‌లో కొత్తగా చేరిన సభ్యులకు పాత మెసేజ్‌లను పంపించడం, ముఖ్యమైన సందేశాలను శాశ్వతంగా పిన్‌ చేయడం వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మార్పులతో గ్రూప్‌లో జరుగుతున్న చర్చలను కొత్త సభ్యులు సులభంగా అర్థం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఇప్పటివరకు వాట్సాప్‌ గ్రూప్‌లో గరిష్ఠంగా నాలుగు మెసేజ్‌లను మాత్రమే పిన్‌ చేసుకునే అవకాశం ఉంది. అవి 24 గంటలు, ఏడు రోజులు లేదా 30 రోజుల పాటు కనిపించేలా సెట్‌ చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌తో ముఖ్యమైన సందేశాలను ఎలాంటి గడువు లేకుండా ఎప్పటికీ పిన్‌ చేసి ఉంచుకోవచ్చు. దీంతో గ్రూప్‌లో కీలక సమాచారం పదేపదే వెతకాల్సిన అవసరం ఉండదు.

గ్రూప్‌లో కొత్తగా చేరిన సభ్యులకు పాత చాట్‌ హిస్టరీని పంపించే సదుపాయాన్ని కూడా వాట్సాప్‌ విస్తరిస్తోంది. గతంలో కొత్త సభ్యులను చేర్చే సమయంలోనే అడ్మిన్లు ఈ హిస్టరీని షేర్‌ చేయగలిగేవారు. ఇకపై అప్పట్లో పంపడం మరిచిపోయిన సభ్యులకు కూడా తర్వాత చాట్‌ హిస్టరీని షేర్‌ చేయవచ్చు. ఇటీవల చేరిన సభ్యుడి పేరుపై క్లిక్‌ చేసి అడ్మిన్లు లేదా గ్రూప్‌ మేనేజర్లు ఈ ప్రక్రియను చేపట్టవచ్చు. ఇలా పంపే సందేశాలు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

మరో కొత్త ఫీచర్‌తో గ్రూప్‌లో తమను ప్రస్తావించిన మెసేజ్‌లను (మెన్షన్స్‌) ప్రత్యేకంగా ఫిల్టర్‌ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ ఎంచుకుంటే తమను ట్యాగ్‌ చేసిన సందేశాలు మాత్రమే గుర్తించేలా చాట్‌ విండోలో హైలైట్‌ అవుతాయి. ఇక గ్రూప్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా స్టేటస్‌ షేర్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొస్తోంది. ఎంపిక చేసిన గ్రూప్‌ సభ్యులకే ఆ స్టేటస్‌ కనిపిస్తుంది. సాధారణ వాట్సాప్‌ స్టేటస్‌ తరహాలోనే 24 గంటల తర్వాత మాయమవుతుంది. ఇతర సభ్యులు దానికి స్పందించడంతో పాటు తమ స్టేటస్‌ను కూడా జోడించవచ్చు. ఈ నాలుగు ఫీచర్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.