యూపీఐ ఎండీఆర్ వాయిదా.. కేంద్రం నిర్ణయానికి వ్యాపార సంఘాలు కృతజ్ఞతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీఐ ఎండీఆర్ వాయిదా.. కేంద్రం నిర్ణయానికి వ్యాపార సంఘాలు కృతజ్ఞతలు

Central Government postpones UPI MDR charges as trade associations welcome the decision
  • యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపు వాయిదా
  • అక్టోబర్ 15 తర్వాత అమలు చేయాల్సిన నిర్ణయాన్ని పొడిగించిన కేంద్రం
  • పండగ సీజన్‌లో కేంద్రం నిర్ణయంపై వ్యాపారులు హర్షం
  • ఎండీఆర్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రభుత్వానికి వ్యాపార సంఘాల విజ్ఞప్తి
  • ఈ ఛార్జీలు అంతిమంగా వినియోగదారులపై భారం మోపుతాయని ఆందోళన
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యూపీఐ) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడంపై వ్యాపార సంఘాలు స్పందించాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించాయి.

పండగ సీజన్ ముందు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. అక్టోబర్ 15 తర్వాత ఈ ఛార్జీలను అమలు చేయాలని తొలుత భావించినప్పటికీ, వ్యాపారుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో గడువును పొడిగించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన వ్యాపార సంఘాలు, ఎండీఆర్ ప్రతిపాదనను శాశ్వతంగా రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశాయి.

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధిస్తే వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, ముఖ్యంగా దీపావళి వంటి పండగ సీజన్‌లో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగే సమయంలో ఇది తమపై అదనపు భారం మోపుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వ్యాపారులకు ఉపశమనం కలిగించింది.

ఈ నిర్ణయంపై చాందినీ చౌక్ ట్రేడర్స్ కౌన్సిల్ కోశాధికారి రాజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ, "ఇది చాలా మంచి నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుంచి వ్యాపారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఎండీఆర్ అమలు నిర్ణయం వాస్తవానికి వ్యాపారులపై గానీ, కొనుగోలుదారులపై గానీ పెద్దగా ప్రభావం చూపేది కాదు. అప్పుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించాం. ఇప్పుడు దాని వాయిదాను కూడా స్వాగతిస్తున్నాం" అని ఐఏఎన్ఎస్‌కు తెలిపారు.

సదర్ బజార్ బారీ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరమ్‌జీత్ సింగ్ మాట్లాడుతూ "ఇది కచ్చితంగా సరైన నిర్ణయం. మేం దీనిని స్వాగతిస్తున్నాం. ఈ అంశంపై మేం నిరసన తెలిపి, పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరాం. పండగ సమయంలో ఈ ఛార్జీల వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు" అని అన్నారు.

ఢిల్లీ శారీ మర్కంటైల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్ భరద్వాజ్ స్పందిస్తూ.. "ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వ్యాపారులకు, వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనకరం. ఎందుకంటే ఎండీఆర్ వల్ల వ్యాపారికి ఖర్చు పెరిగితే, ఆ భారాన్ని వస్తువుల ధరలలో కలుపుతారు. దాని ప్రత్యక్ష ప్రభావం వినియోగదారుడిపైనే పడుతుంది" అని వివరించారు. ఈ నిర్ణయం పట్ల ఢిల్లీలోని ఇతర దుకాణదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. యూపీఐపై ఎలాంటి ఛార్జీలు లేకపోవడం వల్ల కస్టమర్లు ఎలాంటి సంకోచం లేకుండా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని పేర్కొన్నారు.
Advertisement
Central Government
UPI MDR charges
Merchant Discount Rate
Digital payments India
Trade associations response

More Telugu News