హైజాక్ హెచ్చరిక... ఎయిరిండియాలో కనిపించని అనుమానాస్పద వస్తువులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైజాక్ హెచ్చరిక... ఎయిరిండియాలో కనిపించని అనుమానాస్పద వస్తువులు

Hijack alert Air India flight lands in Jaipur no suspicious objects found
  • ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక
  • జైపూర్ విమానాశ్రయంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన భద్రతా తనిఖీలు
  • అనుమానాస్పదంగా ఏమీ లేదని తేల్చిన అధికారులు
  • ఢిల్లీకి బయలుదేరేందుకు విమానానికి క్లియరెన్స్
ఫ్రాంక్‌ఫర్ట్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో హైజాక్ అలర్ట్ కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో విమానాన్ని బుధవారం ఉదయం జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, విమానం ఢిల్లీకి బయలుదేరేందుకు అనుమతి ఇచ్చారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఏఐ-2030 విమానం నుంచి హైజాక్ హెచ్చరిక అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు అందింది. వారు వెంటనే జైపుర్ ఏటీసీని అప్రమత్తం చేయడంతో విమానాన్ని ఉదయం 9:45 గంటల సమయంలో జైపుర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ముందుజాగ్రత్త చర్యగా ప్రయాణికులందరినీ కిందకు దించి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సహా ఇతర భద్రతా ఏజెన్సీల బృందాలు రంగంలోకి దిగి, సుమారు రెండున్నర గంటల పాటు విమానంలో విస్తృతంగా సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం, విమానం తిరిగి ఢిల్లీకి పయనమవ్వడానికి క్లియరెన్స్ ఇచ్చారు.

అసలు హైజాక్ అలర్ట్ ఎలా జారీ అయిందనే దానిపై భద్రతా ఏజెన్సీలు విచారణ చేపట్టాయి. పైలట్ పొరపాటున అలర్ట్ బటన్ నొక్కారా? లేక సాంకేతిక లోపం వల్ల ఈ హెచ్చరిక వచ్చిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణలో పైలట్ తాను పొరపాటున బటన్ నొక్కలేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ ఘటన నేపథ్యంలో జైపూర్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాధారణంగా విమానం హైజాక్ అయినప్పుడు పైలట్లు 'కోడ్ 7500' ద్వారా ఏటీసీకి సంకేతాలు పంపుతారు. ఈ కోడ్ అందిన వెంటనే అధికారులు అత్యంత కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటారు.
Advertisement
Air India
Hijack Alert
Jaipur Airport
AI 2030 Flight
Emergency Landing
Security Check

More Telugu News