వీధుల్లో కాదు.. పార్లమెంట్‌ నుంచే పాలన: ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ ఘాటు విమర్శులు
Add ap7am to your home Screen

వీధుల్లో కాదు.. పార్లమెంట్‌ నుంచే పాలన: ప్రతిపక్షాల నిరసనలపై బీజేపీ ఘాటు విమర్శులు

Governance happens in Parliament not on streets BJP slams opposition protests
  • ప్రతిపక్షాల నిరసనలపై రవిశంకర్‌ ప్రసాద్‌ విమర్శలు
  • పార్లమెంట్‌ నుంచే దేశ పాలన సాగుతుందని వ్యాఖ్య
  • వీధుల్లో చేసే ఆందోళనలను రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంటున్నారని ఆరోపణ
  • ప్రతిపక్ష కూటమిలోనూ పోటీ ఉందని ఎద్దేవా
  • నిన్న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలను ప్రస్తావించిన బీజేపీ
భారత్‌ అరాచక రాజ్యం కాదని, దేశ పాలన పార్లమెంట్‌ నుంచే సాగుతుందని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. వీధుల్లో ఆందోళనలు చేసి ప్రభుత్వాన్ని నడపలేరని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ ఎప్పుడూ తలవంచలేదని, భవిష్యత్తులోనూ తలవంచబోదని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నించారు. అయితే ఈ ఆందోళనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, పినరయి విజయన్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం తప్పు కాదని రవిశంకర్‌ అన్నారు. అయితే ఎన్నికల్లో ఓటముల తర్వాత ప్రతిపక్షాలు వీధి నిరసనలను రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంటున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలోని పార్టీల మధ్య కూడా పోటీ నెలకొందని ఎద్దేవా చేశారు.

రాహుల్‌ గాంధీ మూడు రోజుల పాటు ఆందోళనలో ఉండి ఆ తర్వాత వెళ్లిపోయారని, అనంతరం ఆమ్‌ ఆద్మీ పార్టీకి మద్దతుగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) రంగంలోకి దిగిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, వామపక్ష నేతలు కూడా ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చారని అన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీ ప్రజలను ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు.

ఇదే సమయంలో అసోం, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన విజయాలను రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రస్తావించారు. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలోనూ ఈ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు.
Advertisement
Ravi Shankar Prasad
BJP
Opposition Protests
Jantar Mantar Delhi
Narendra Modi
Indian Politics

More Telugu News