నోయిడా విమానాశ్రయానికి మోదీ పేరు.. యోగి సర్కారు కీలక నిర్ణయం!
Add ap7am to your home Screen

నోయిడా విమానాశ్రయానికి మోదీ పేరు.. యోగి సర్కారు కీలక నిర్ణయం!

Noida Airport to be named after Modi Yogi government key decision
  • పేరుమార్పు తీర్మానానికి యోగి మంత్రివర్గం ఆమోదం
  • మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్ణయం
  • మోదీకి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న యోగి
  • విమానాశ్రయం తొలి దశను మార్చిలో ప్రారంభించిన ప్రధాని మోదీ
  • తొలి దశలో ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చాలని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఈ విమానాశ్రయాన్ని ‘నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం’గా పిలవనున్నారు. ప్రధాని మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు.

శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 39 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన యోగి.. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ప్రధానికి ప్రత్యేక అనుబంధం ఉందని, వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని చెప్పారు.

2017కు ముందు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండేవని యోగి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, మెట్రో, రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ వ్యవస్థలతో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగయ్యాయని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ అభివృద్ధి వంటి కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు.

జెవార్‌లో నిర్మిస్తున్న నోయిడా విమానాశ్రయం ఉత్తర్‌ప్రదేశ్‌కు అందించిన గొప్ప బహుమతిగా యోగి అభివర్ణించారు. ఇది భవిష్యత్తులో దేశంలోనే కీలక విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయం తొలి దశను ప్రధాని మోదీ ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు. మొదటి దశలో ఏడాదికి సుమారు 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండనుంది. నాలుగు దశల నిర్మాణం పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది.
Advertisement
Narendra Modi
Noida International Airport
Yogi Adityanath
Uttar Pradesh Government
Jewar Airport Renaming
PM Modi 25 Years Public Service

More Telugu News