హైదరాబాద్‌లో ఇండీ కూటమి ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీలో ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్ట్‌
Add ap7am to your home Screen

హైదరాబాద్‌లో ఇండీ కూటమి ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీలో ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్ట్‌

Tension at INDIA Alliance Save Democracy rally in Hyderabad as several leaders are arrested
  • హైదరాబాద్‌లో ఇండీ కూటమి ‘చలో లోక్‌భవన్‌’ ర్యాలీ.
  • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌.
  • లోక్‌భవన్‌ వద్ద పోలీసుల బారికేడ్లు
  • పోలీసులతో నేతలకు తీవ్ర వాగ్వాదం
  • పొన్నం, మహేశ్‌ గౌడ్‌ సహా నేతల అరెస్ట్‌
‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఇండీ కూటమి హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్‌ వరకు కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్‌, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

లోక్‌భవన్‌ వద్దకు ర్యాలీ చేరుకున్న సమయంలో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కూటమి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వేం నరేందర్‌రెడ్డి తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని డీసీఎంలో తరలించారు.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై ఇండీ కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ‘సేవ్‌ డెమోక్రసీ’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు చేపట్టాలని కూటమి గతంలో కార్యాచరణ రూపొందించింది.

మరోవైపు ఢిల్లీలోనూ ఇండీ కూటమి తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో కూటమి నేతలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో మరో నిరసన చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
INDIA Alliance
Save Democracy Rally Hyderabad
Ponnam Prabhakar
Mahesh Kumar Goud
Asaduddin Owaisi
CEC Gyanesh Kumar Resignation

More Telugu News