'నన్ను ఓ వ్యక్తి ఫాలో అయ్యాడు.. మరోసారి రిస్క్ తీసుకోను'.. స్కూటీపై వెళ్లే మ‌హిళ‌ వినూత్న భద్రతా ఏర్పాటు!
Add ap7am to your home Screen

'నన్ను ఓ వ్యక్తి ఫాలో అయ్యాడు.. మరోసారి రిస్క్ తీసుకోను'.. స్కూటీపై వెళ్లే మ‌హిళ‌ వినూత్న భద్రతా ఏర్పాటు!

Bengaluru woman installs helmet camera after being followed by a stranger to ensure safety
  • ఆగంతుకుడు ఇంటి వరకు వెంబడించడంతో భద్రతపై మహిళ ఆందోళన
  • బెంగళూరులో స్కూటీ నడిపే మ‌హిళ‌ హెల్మెట్‌కు కెమెరా ఏర్పాటు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. భద్రతపై విస్తృత చర్చ
బెంగళూరు నగరంలో మహిళల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ ఆగంతుకుడు తనను ఇంటి వరకు వెంబడించడంతో భవిష్యత్తులో అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన హెల్మెట్‌కు కెమెరాను అమర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ముఖ్యంగా మహిళా రైడర్ల భద్రతపై విస్తృత చర్చ జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో స్కూటీ నడిపే ఓ మహిళ హెల్మెట్‌కు అమర్చిన కెమెరాను చూసి మరో రైడర్ ఆశ్చర్యపోయాడు. దాని ధర ఎంత అని ప్రశ్నించగా, ఆమె సుమారు రూ. 3,000 అని సమాధానమిచ్చారు. అనంతరం కెమెరా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఆమె చెప్పిన కారణం అందరినీ ఆలోచింపజేసింది. "కొంతకాలం క్రితం ఓ వ్యక్తి నన్ను ఇంటి వరకు వెంబడించాడు. నేను మరోసారి అలాంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అందుకే భద్రత కోసం ఈ కెమెరా పెట్టుకున్నాను" అని ఆమె తెలిపారు.

ఈ సంభాషణను 'throttle_d390' అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అక్టోబర్ 1న పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ పోస్ట్ కింద నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. నగరాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత ఆందోళనకరంగా మారుతోందని పలువురు అభిప్రాయపడ్డారు.

చాలా మంది పురుషులు సరదా కోసం, వ్లాగింగ్ లేదా కంటెంట్ సృష్టించడం కోసం ఇలాంటి కెమెరాలు కొనుగోలు చేస్తుంటారని, కానీ మహిళలకు మాత్రం ఇవి అత్యవసర భద్రతా పరికరాలుగా మారుతున్నాయని కొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, సాక్ష్యంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మహిళలు ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను మరోసారి కళ్లకు కట్టింది.
Advertisement
Bengaluru Woman
Women Safety Bengaluru
Helmet Camera for Safety
Stalking Incident
Viral Instagram Video
Scooter Rider Security

More Telugu News