ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమానికి డబ్బుల కోసం వెళ్లారా?.. కోహ్లీ ప్రతినిధి ఏమన్నారంటే..!

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమానికి డబ్బుల కోసం వెళ్లారా?.. కోహ్లీ ప్రతినిధి ఏమన్నారంటే..!

Virat Kohli team clarifies on rumors regarding Premanand Maharaj Ashram visit payment
  • ఆశ్రమ సందర్శనకు కోహ్లీకి రూ.5 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలు
  • ఈ వార్తలను పూర్తిగా ఖండించిన విరాట్ కోహ్లీ ప్రతినిధి
  • ఇవి నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన ఆరోపణలని వెల్లడి
  • మహరాజ్‌పై భక్తి, విశ్వాసంతోనే కోహ్లీ ఆశ్రమానికి వెళ‌తారని స్పష్టీకరణ
  • యూపీ సీఎంకు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేసినట్లు సమాచారం
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ తరచూ వృందావన్‌లోని ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించడం తెలిసిందే. అయితే, ఈ సందర్శన వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఆశ్రమానికి వెళ్లేందుకు విరాట్ కోహ్లీకి ఒక ప్రైవేట్ సంస్థ రూ.5 కోట్లు చెల్లించిందన్న వాదనలను ఆయన ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని స్పష్టం చేశారు.

శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు దినేశ్‌ శర్మ (ఫలహరి మహరాజ్) ఈ ఆరోపణలు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ, విరాట్ కోహ్లీని ఆశ్రమానికి తీసుకువచ్చేందుకు రూ.5 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపిస్తూ ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒక లేఖ రాసినట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో వివాదం మొదలైంది.

ఈ ఆరోపణలపై విరాట్ కోహ్లీ టీమ్ అధికారికంగా స్పందించింది. కోహ్లీ ఆశ్రమ సందర్శన వెనుక ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవని తేల్చిచెప్పింది. "ప్రేమానంద్ మహరాజ్ పట్ల విరాట్ కోహ్లీకి ఉన్న ప్రగాఢమైన భక్తి, విశ్వాసం కారణంగానే ఆయన ఆశ్రమానికి వెళ్తున్నారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో వార్తలు ప్రచురించే ముందు మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించుకోవాలి" అని కోహ్లీ ప్రతినిధి ఒక ప్రకటనలో కోరారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తొలిసారిగా జనవరి 2023లో ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పటి నుంచి వారికి వీలు చిక్కినప్పుడల్లా ఆశ్రమానికి వెళ్లి మహరాజ్ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయమని వారి సన్నిహితులు చెబుతున్నారు. 

కాగా, రూ.5 కోట్లు చెల్లించినట్లుగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు, ఒప్పంద పత్రాలు గానీ బయటకు రాలేదు. దీంతో ఈ ఆరోపణలు కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
Advertisement
Virat Kohli
Anushka Sharma
Premanand Maharaj Ashram
Vrindavan
Virat Kohli Ashram Controversy
Dinesh Sharma Allegations

More Telugu News