నిరంతరాయంగా 25 ఏళ్లు.. ప్రత్యేక పూజలతో మైలురాయిని జరుపుకున్న ప్రధాని

నిరంతరాయంగా 25 ఏళ్లు.. ప్రత్యేక పూజలతో మైలురాయిని జరుపుకున్న ప్రధాని

Narendra Modi completes 25 years in office and performs special prayers
  • ప్రజాసేవలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ
  • ఈ సందర్భంగా ఢిల్లీలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు 
  • 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ఆయన ప్రస్థానం ప్రారంభం
ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ ఉదయం ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న శ్రీ వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి హారతి ఇచ్చి, ప్రార్థనలు చేశారు.

2001 అక్టోబర్ 7న మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి వరుసగా సీఎంగా, ఆ తర్వాత 2014 నుంచి ప్రధానమంత్రిగా ఆయన తన సేవలను కొనసాగిస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించారు.

ఆలయ సందర్శన అనంతరం మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరి సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం కోసం గణేశుడిని ప్రార్థించాను. విఘ్నేశ్వరుడి దయతో అందరికీ సంక్షేమం కలగాలని, దేశం నిరంతరం పురోగతి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నాను" అని పేర్కొన్నారు.

ఈ మైలురాయిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా "సేవా సంకల్ప్ అభియాన్" పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర కేబినెట్ కూడా మోదీకి అభినందనలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు విదేశీ రాజకీయ ప్రముఖులు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Narendra Modi
25 years in office
Sri Vinayaka Mandir Delhi
Prime Minister of India
Seva Sankalp Abhiyan
Gujarat Chief Minister

More Telugu News