ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష... కేసీఆర్ కుటుంబానికి నోటీసులు!

ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష... కేసీఆర్ కుటుంబానికి నోటీసులు!

Revanth Reddy reviews Erravelli lands and issues notices to KCR family
  • ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • సర్వేలో 45 ఎకరాల భూమి తేడా ఉన్నట్టు గుర్తింపు
  • రికార్డులు సమర్పించాలని కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
  • అదే భూమిలో అమరవీరుల కాలనీ నిర్మాణానికి ఆదేశం
  • జూన్ 2 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచన
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల భూముల సర్వే నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండగా, క్షేత్రస్థాయి సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో గల్లంతైన 45 ఎకరాల భూమి ఎక్కడుందో వెంటనే గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ భూమిని గుర్తించేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాలకు సర్వే నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

సర్వే నంబర్ 325లోని భూమిని అమరవీరుల కుటుంబాల కోసం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 'అమరవీరుల కాలనీ' నిర్మించి, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. ఈ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగిస్తూ, జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ జరపాలని గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాల మేరకే రెవెన్యూ అధికారులు ఇటీవలి వారాల్లో ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
Advertisement
Revanth Reddy
Erravelli land survey
KCR family notice
Martyrs Colony Telangana
Siddipet land records
Erravelli farmhouse survey

More Telugu News