100 కి.మీ వేగంతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బ్రిడ్జి దాటేసిన వందే భారత్ రైలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 కి.మీ వేగంతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బ్రిడ్జి దాటేసిన వందే భారత్ రైలు

Vande Bharat train crosses worlds highest bridge at 100 kmph speed
  • చీనాబ్, అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్
  • కత్రా-బనిహాల్ సెక్షన్‌లో 100 కి.మీ. వేగానికి పెరిగిన అనుమతి
  • విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసినట్లు తెలిపిన రైల్వే అధికారులు
  • కశ్మీర్ లోయకు ప్రయాణ సమయం తగ్గనుందని వెల్లడి
జమ్ము కశ్మీర్‌లో భారతీయ రైల్వే మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జితో పాటు, దేశంలోని మొట్టమొదటి కేబుల్ ఆధారిత అంజీ వంతెనపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కత్రా-బనిహాల్ సెక్షన్‌లో నిర్వహించిన ఈ ట్రయల్ రన్‌ విజయవంతమైంది.

ఉత్తర రైల్వే పరిధిలోని 111 కిలోమీటర్ల పొడవైన కత్రా-బనిహాల్ మార్గంలో గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 75 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెంచారు. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలు (నం. 26401/26404) తో నిర్వహించిన ట్రయల్ రన్‌లో రైలు ఈ రెండు కీలక వంతెనలపై గంటకు 100 కి.మీ. వేగాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ ధ్రువీకరించారు.

కశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టులో కత్రా-బనిహాల్ సెక్షన్ అత్యంత కీలకమైనది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ట్రయల్ రన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, "భారత ఇంజినీరింగ్ అద్భుతం.. గంటకు 100 కిలోమీటర్ల వేగం" అని వ్యాఖ్యానించారు.

రైల్వే మంత్రిత్వ శాఖ గత ఆగస్టులోనే భద్రతా నిబంధనలను సమీక్షించి, వేగాన్ని పెంచడానికి అనుమతులు మంజూరు చేసింది. పెరిగిన వేగం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
Advertisement
Vande Bharat Express
Chenab Bridge
Jammu Kashmir
Indian Railways
Anji Khad Bridge
USBRL Project

More Telugu News