తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

Good news for Telangana employees and pensioners
  • ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటికి ఆమోదం
  • డీఏల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 2,500 కోట్ల అదనపు భారం
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది.

మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వారు ఈ సందర్భంగా వివరించారు. రెండు డీఏల వల్ల ప్రభుత్వంపై సుమారు రూ. 2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లు మంత్రులు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే 19,892 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు వారు వెల్లడించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం నిన్నటితో వర్షాకాలం ముగిసిందని, ఈ ఏడాది సగటున 17 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఎల్‌ నినో ప్రభావంపై కేబినెట్ అత్యవసర నివేదికను సిద్ధం చేస్తోందని మంత్రులు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా 5,800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రులు వెల్లడించారు. వీటితో పాటు 'తెలంగాణ డిజిటల్ మీడియా అండ్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ'కి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వారు పేర్కొన్నారు.
Advertisement
Telangana Government
DA Hike Telangana
Revanth Reddy
Telangana Employees Pensioners DA
Telangana Cabinet Decisions

More Telugu News