ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ!
Advertisement

ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ!

Mobile live TV without Internet
  • D2M టెక్నాలజీ అమలుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
  • వాణిజ్య అమలు కోసం అక్టోబర్‌లో RFP జారీ
  • మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం
మొబైల్ ఫోన్‌లో లైవ్ టీవీ ఛానల్స్ చూడటానికి ఇకపై ఇంటర్నెట్ డేటా లేదా వైఫై అవసరం లేదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 'డైరెక్ట్-టు-మొబైల్' (D2M) అనే సరికొత్త టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా సిమ్ కార్డు, డేటా కనెక్షన్ లేకపోయినా నేరుగా మొబైల్‌లోనే టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.

ఏంటీ D2M టెక్నాలజీ?
D2M అనేది బ్రాడ్‌కాస్టింగ్, బ్రాడ్‌బ్యాండ్ కలయికతో పనిచేసే సాంకేతికత. దీని ద్వారా ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే లైవ్ టీవీ, వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను నేరుగా మొబైల్స్‌కు ప్రసారం చేయవచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్ సిగ్నల్స్ బలహీనంగా ఉండే గిరిజన, అటవీ, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోని ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్, తేజస్ నెట్‌వర్క్స్ (గతంలో సాంఖ్య ల్యాబ్స్) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 19కి పైగా నగరాల్లో ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. వాణిజ్యపరమైన అమలు కోసం అక్టోబర్‌లో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 470-582 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో ఈ ప్రసారాలు జరుగుతాయని, దీనివల్ల సెల్యులార్ నెట్‌వర్క్‌లకు ఎలాంటి అంతరాయం ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు.

అయితే, ఈ టెక్నాలజీ విస్తృత వినియోగానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. D2M ప్రసారాలను స్వీకరించేందుకు ఫోన్లలో ATSC 3.0 ప్రమాణాలకు అనుగుణమైన హార్డ్‌వేర్ ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా స్మార్ట్‌ఫోన్లు దీనికి సపోర్ట్ చేయవు. మరోవైపు, ఈ టెక్నాలజీ వల్ల తమ డేటా ఆదాయానికి గండి పడుతుందని టెలికాం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement
Mobile live TV without Internet
Internet

More Telugu News