కవిత ప్రశ్నలకే సమాధానాలు లేవు: కేటీఆర్, హరీశ్‌పై అద్దంకి దయాకర్ ఫైర్
Advertisement

కవిత ప్రశ్నలకే సమాధానాలు లేవు: కేటీఆర్, హరీశ్‌పై అద్దంకి దయాకర్ ఫైర్

Addanki Dayakar fires at KTR and Harish Rao over Kavitha questions
  • హరీశ్‌ రావును గుంటనక్క అని కవితే అన్నారన్న అద్దంకి
  • కేసీఆర్ కుమారుడు కావడమే కేటీఆర్ ఏకైక అర్హత అని విమర్శ
  • బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులపై కేసులు పెట్టారని ఆరోపణ
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత కుటుంబ సభ్యురాలైన కల్వకుంట్ల కవిత అడిగే ప్రశ్నలకు కూడా వారిద్దరి వద్ద సమాధానాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి కృత్రిమ ప్రచారాలు, పాటలు చేయించడం మాని, ముందు ఇంట్లో చెల్లి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ కు హితవు పలికారు.

హరీశ్ రావును 'గుంటనక్క' అని కవితే అన్నారని అద్దంకి తెలిపారు. కేసీఆర్ కొడుకు కావడం తప్ప కేటీఆర్‌కు నాయకత్వ అర్హతలేమీ లేవని, ఆ కుటుంబ సంబంధం లేకపోతే ఆయనకు రాజకీయ మనుగడ సున్నా అని విమర్శించారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడాన్ని కేటీఆర్ తప్పుబట్టడం ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు దోచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని విమర్శించారు. అదే సమయంలో సొంత పార్టీలోని గిరిజన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వివక్ష చూపారని అద్దంకి ఆరోపించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి కేసీఆర్ కుటుంబం ఫామ్‌హౌస్‌లు, అక్రమ వ్యాపారాలు నడిపిందని దుయ్యబట్టారు. పదేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి, కోదండరాం, మందకృష్ణ మాదిగ వంటి ఉద్యమ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. బీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి రానివ్వకూడదని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.


Advertisement
Addanki Dayakar
KTR
Harish Rao
Kalvakuntla Kavitha
BRS Party
Telangana Politics

More Telugu News