విలాసాలే కొంపముంచాయి.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను పట్టించిన ఖరీదైన జీవితం!

విలాసాలే కొంపముంచాయి.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను పట్టించిన ఖరీదైన జీవితం!

Lakshmi Bhaskar NIMS Doctor caught by ACB due to lavish lifestyle
  • ఏసీబీ దృష్టిలో పడిన లక్ష్మీ భాస్కర్ విలాసవంతమైన జీవనశైలి 
  • రోజుకో ఖరీదైన కారు, విదేశీ పర్యటనలతో డాక్టర్ బిజీబిజీ 
  • గతంలో ఉద్యోగం కోల్పోయినా మళ్లీ చేరి అవినీతి బాగోతం 
  • రూ.6 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు
  • లక్ష్మీ భాస్కర్‌కు సహకరించిన సిబ్బంది, బినామీలపై కూడా దర్యాప్తు కొనసాగింపు
ఆడంబరమే ఆయన కొంపముంచింది. విలాసవంతమైన జీవనశైలే ఆయనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టించింది. రోజూ ఓ కొత్త ఖరీదైన కారులో ఆసుపత్రికి రావడం, తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడం, దేశంలోని లగ్జరీ హోటళ్లు, రిసార్టుల్లో పార్టీలు చేసుకోవడం.. ఇవే నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అవినీతి బండారాన్ని బయటపెట్టాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన ఆయన కథ, ఆయన జీవనశైలి వల్లే వెలుగులోకి రావడం గమనార్హం.

లక్ష్మీ భాస్కర్ విలాసవంతమైన జీవితంపై కొన్నాళ్లుగా ఏసీబీ అధికారులు ఓ కన్నేసి ఉంచారు. ఒక ప్రభుత్వ వైద్యుడికి ఇంతటి సంపద ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో లోతుగా విచారణ చేపట్టారు. 2007 నుంచి ఇప్పటివరకు ఆయన అధికారిక ఆదాయం రూ.2 కోట్లు కాగా, అందులో ఖర్చులు పోను సుమారు రూ.1.05 కోట్లు మిగిలి ఉండాలి. కానీ, ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆయనకు రూ.6.13 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు తేలింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ ఇంకా చాలా రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గతంలోనూ అవినీతి మరక.. అయినా మారని తీరు
లక్ష్మీ భాస్కర్‌కు అవినీతి మరక అంటడం ఇది మొదటిసారి కాదు. గతంలో నిమ్స్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఒక రోగి నుంచి డబ్బులు తీసుకుంటూ అప్పటి నిమ్స్ డైరెక్టర్, దివంగత డాక్టర్ కాకర్ల సుబ్బారావుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి ఉద్యోగం కోల్పోయారు. అయితే, రాజకీయ పలుకుబడితో ఆయన మళ్లీ నిమ్స్‌లో అడుగుపెట్టడమే కాకుండా, పరిపాలనా విభాగంలో కీలక స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తనకు అవకాశం దొరికిన ప్రతీచోట వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది.

ఒకసారి చేసిన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోకుండా, మరింతగా అవినీతి ఊబిలో కూరుకుపోయిన లక్ష్మీ భాస్కర్.. తన విలాసవంతమైన జీవనశైలితో తానే దొరికిపోయారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆయనకు సహకరించిన ఇతర ఉద్యోగులు, బినామీలపై కూడా దృష్టి సారించి దర్యాప్తును విస్తృతం చేస్తున్నారు. 
Advertisement
Lakshmi Bhaskar
NIMS Doctor
ACB Raid Hyderabad
Disproportionate Assets Case
NIMS Additional Superintendent
Telangana Corruption News

More Telugu News