'సర్' నోటీసులపై ఈసీ కీలక ప్రకటన.. వ్యక్తిగత హాజరు అవసరం లేదు!

'సర్' నోటీసులపై ఈసీ కీలక ప్రకటన.. వ్యక్తిగత హాజరు అవసరం లేదు!

Election Commission key announcement on SSR notices personal appearance not required
  • సర్ నోటీసులపై ఈసీ కీలక ప్రకటన
  • అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత హాజరు అవసరం లేదు
  • కొత్త ఓటర్లు నిరంతర నమోదు ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
  • 20 రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటరు జాబితా సవరణ పూర్తి
  • ఫారం-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని వెల్లడి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక ఊరటనిచ్చింది. ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బీఎల్వోలే ఓటర్ల ఇంటికి వచ్చి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకుంటారని వివరించింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి సమావేశమై పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.

సవరణ ప్రక్రియలో భాగంగా ఫారం-6కు జతపరిచే డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని ఈ సందర్భంగా ఈసీ గుర్తుచేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్‌తో సహా ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. జాబితాలో పేర్లు లేని వారు, యువత, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు నిరంతర నమోదు ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఇందుకోసం సంబంధిత నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని (ERO) సంప్రదించాలని, త్వరలో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని పేర్కొంది.

ఇటీవల గోవాలో 97 మంది అర్హులైన ఓటర్ల పేర్లు తుది జాబితాలో గల్లంతైన ఉదంతంపై ఈసీ స్పందిస్తూ, బూత్ స్థాయి అధికారులతో ఇంటింటి సర్వే చేయిస్తున్నామని తెలిపింది. గల్లంతైన వారిలో ఇప్పటికే 81 మంది ఫారం-6 ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకున్నారని గోవా సీఈవో వివరించారు.

ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ సెక్రటరీకి రాసిన లేఖపై తలెత్తిన ఊహాగానాలపై కూడా ఈసీ స్పష్టత ఇచ్చింది. సదరు లేఖ ఎన్నికల సంఘానికి డిప్యుటేషన్‌పై వచ్చిన ఒక అధికారి పనితీరుకు సంబంధించినదని, అంతే తప్ప ఈసీ లేదా ఐటీ శాఖల విధానపరమైన అంశాలకు దానికి ఎలాంటి సంబంధం లేదని వివరించింది.
Advertisement
Election Commission of India
SSR notices
Voter registration Form 6
Gyanesh Kumar CEC
Voter list revision

More Telugu News