ప్రీ-బోర్డులో ఫెయిల్, ఐఐటీలో సీటు, ఇప్పుడు ఐపీఎస్.. ఆ అధికారికి అమెరికాలో అరుదైన గౌరవం!

ప్రీ-బోర్డులో ఫెయిల్, ఐఐటీలో సీటు, ఇప్పుడు ఐపీఎస్.. ఆ అధికారికి అమెరికాలో అరుదైన గౌరవం!

Mohibullah Ansari failed in pre-boards then IIT Delhi and now IPS officer wins rare honor in USA
  • ఐపీఎస్ అధికారి మొహిబుల్లా అన్సారీకి అమెరికాలో 'ఏషియన్ హీరో' పురస్కారం
  • ప్రీ-బోర్డు పరీక్షల్లో విఫలమైనా పట్టుదలతో ఐఐటీ ఢిల్లీలో సీటు సాధించిన వైనం
  • మూడో ప్రయత్నంలో సివిల్స్ పాసై ఐపీఎస్‌గా ఎంపిక
  • ఆయన ప్రజాసేవ, నిజాయితీకి గుర్తింపుగా ఈ అవార్డు
  • డిసెంబర్ 13న ఫ్లోరిడాలో ఈ పురస్కారాన్ని అందుకోనున్న అన్సారీ
ఒకప్పుడు పదో తరగతి, పన్నెండో తరగతి ప్రీ-బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. కానీ, ఆ ఓటమికి కుంగిపోలేదు. పట్టుదలతో కష్టపడి దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించారు. అక్కడితో ఆగకుండా సివిల్స్ రాసి ఐపీఎస్ అధికారి అయ్యారు. ఆయనే 2021 బ్యాచ్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి మొహిబుల్లా అన్సారీ. 

ఇప్పుడు తన అద్భుతమైన పనితీరు, ప్రజాసేవకు గాను ఆయన అమెరికాలో ప్రతిష్టాత్మక 'ఏషియన్ హీరో అవార్డు 2026' అందుకోనున్నారు. ఈ వార్త ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తోంది. అమెరికాకు చెందిన 'అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఫెయిర్ అండ్ ఫెస్ట్' సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. 

ఈ ఏడాది డిసెంబర్ 13న ఫ్లోరిడాలో జరగనున్న ఏడో వరల్డ్ ఫెయిర్ అండ్ ఫెస్టివల్ వేడుకలో మొహిబుల్లా అన్సారీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పోలీసింగ్, ప్రజా సేవ, సామాజిక సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషి, అలాగే విధి నిర్వహణలో ఆయన ప్రదర్శిస్తున్న నిజాయితీకి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. 

ప్రస్తుతం ఆయన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (సిటీ ఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక‌, మొహిబుల్లా అన్సారీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. పాఠశాల దశలో ఎదురైన వైఫల్యాలను ఆయన తన విజయానికి సోపానాలుగా మలచుకున్నారు. తన బలహీనతలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించారు. 

ఫలితంగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, 2011లో ఐఐటీ ఢిల్లీలో బీటెక్ కోర్సులో చేరారు. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసినా, ప్రజాసేవ చేయాలన్న తపనతో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యారు.

రెండుసార్లు విఫలమైనా నిరాశ పడకుండా, మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. 2020లో జరిగిన పరీక్షల్లో (2021లో ఫలితాలు) సుమారు 389 ఆల్ ఇండియా ర్యాంకు సాధించి, బీహార్ కేడర్ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అకడమిక్ వైఫల్యాలు జీవితానికి ముగింపు కావని, వాటిని ఎదుర్కొని నిలబడితే అద్భుతాలు సాధించవచ్చని మొహిబుల్లా అన్సారీ జీవితం నిరూపిస్తోంది. ఆయన కథ ఎంతోమందికి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.
Advertisement
Mohibullah Ansari
IPS Officer Mohibullah Ansari
Asian Hero Award 2026
Bihar IPS Officer
IIT Delhi Alumnus
Inspirational Success Story

More Telugu News