తెలంగాణలో డిగ్రీ విద్యకు గడ్డుకాలం.. ఐదేళ్లలో 335 కాలేజీల క్లోజ్!

తెలంగాణలో డిగ్రీ విద్యకు గడ్డుకాలం.. ఐదేళ్లలో 335 కాలేజీల క్లోజ్!

Tough times for degree education in Telangana 335 colleges closed in 5 years
  • ఈ ఏడాది 56 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాని వైనం
  • ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే కారణమంటున్న యాజమాన్యాలు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,000 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆరోపణ
  • వరుసగా మూడేళ్లు 25 శాతం సీట్లయినా నిండకపోతే కాలేజీలు మూతపడే ప్రమాదం
తెలంగాణలో ప్రైవేటు డిగ్రీ విద్య తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. విద్యార్థుల నుంచి ఆదరణ తగ్గడం, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడటంతో ఏటా పదుల సంఖ్యలో కాలేజీలు మూతపడుతున్నాయి. గత ఐదేళ్ల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 335 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు తాళాలు పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2021లో 1,100గా ఉన్న మొత్తం డిగ్రీ కాలేజీల సంఖ్య, ప్రస్తుతం 783కి పడిపోయింది.

తాజాగా ముగిసిన మూడు విడతల 'దోస్త్' కౌన్సెలింగ్‌ తర్వాత కూడా సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది 9 జిల్లాల పరిధిలోని 56 కాలేజీల్లో మొత్తం 16,460 సీట్లు ఉండగా, ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కాలేదు. నిబంధనల ప్రకారం, వరుసగా మూడేళ్లపాటు 25 శాతం సీట్లు భర్తీ కాని కాలేజీల గుర్తింపును రద్దు చేస్తారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో మరో 50కి పైగా కాలేజీలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో ప్రముఖంగా ఉన్న 4 దశాబ్దాల చరిత్ర గల నీలగిరి డిగ్రీ కాలేజీ సైతం గతేడాది మూతపడింది.

ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం ఆరోపిస్తోంది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు ఇస్తున్న ప్రాధాన్యం డిగ్రీకి ఇవ్వడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద తమకు దాదాపు రూ.2,000 కోట్లు రావాల్సి ఉందని సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే కాలేజీలను మూసివేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గురువారం నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, విద్యార్థులు నేరుగా కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.
Advertisement
Telangana Degree Colleges
DOST Admissions 2024
Private Degree Colleges Association
Fee Reimbursement Telangana
Suryanarayana Reddy
Education Crisis in Telangana

More Telugu News