13 నెలల్లోనే గూగుల్.. 17 నెలల్లో ఆర్సెలర్.. ఏపీ స్పీడ్ ఇదేనన్న లోకేశ్

13 నెలల్లోనే గూగుల్.. 17 నెలల్లో ఆర్సెలర్.. ఏపీ స్పీడ్ ఇదేనన్న లోకేశ్

Nara Lokesh says Google in 13 months and Arcelor in 17 months is AP speed
  • వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపీని గ్రోత్ ఇంజన్‌గా నిలుపుతామన్న లోకేశ్
  • అహ్మదాబాద్‌లో గుజరాత్ పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశం
  • ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి
  • ప్రభుత్వ పనితీరు బుల్లెట్ ట్రైన్ వేగంతో ఉంటుందని పెట్టుబడిదారులకు హామీ
  • గుజరాత్, ఏపీ కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని వ్యాఖ్య
2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన గ్రోత్ ఇంజన్‌గా నిలవాలని, ఈ అభివృద్ధి ప్రయాణంలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో జరిగిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుజరాత్ పారిశ్రామిక స్ఫూర్తి దేశానికి ఆదర్శమని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆ రాష్ట్రం సాధించిన ప్రగతి అద్భుతమని కొనియాడారు. వైబ్రంట్ గుజరాత్ మోడల్ స్ఫూర్తితో ఏపీ కూడా శరవేగంగా దూసుకెళ్తోందని, ఈ ప్రగతిలో గుజరాత్ పారిశ్రామిక రంగం భాగస్వామి కావాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో, వేగవంతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని లోకేశ్ తెలిపారు. తమ ప్రభుత్వ పనితీరుకు ఫలితాలే నిదర్శనమని, 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకే వచ్చాయని గుర్తుచేశారు. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో వేగం చూపిస్తున్నామని వివరించారు. గుజరాత్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే, ఏపీలో కేంద్రం సహకారంతో 'నాయుడు-మోదీజీ' జోడీతో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ వేగానికి ఉదాహరణగా గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టులను లోకేశ్ ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కేవలం 13 నెలల్లో పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా, సుమారు 12 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రానున్న ఆర్సెలర్ మిట్టల్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన భూసేకరణ, పర్యావరణ అనుమతులు, పునరావాసం వంటి క్లిష్టమైన ప్రక్రియలను కేవలం 17 నెలల్లో పూర్తి చేశామని వివరించారు. పెట్టుబడిదారుల సమస్యలను వ్యక్తిగత సమస్యగా కాకుండా, వ్యవస్థాగత సమస్యగా చూసి శాశ్వత పరిష్కారాలు చూపుతామని భరోసా ఇచ్చారు. అందుకే కొందరు తనను సరదాగా 'ఆంధ్రా డోలో-650' అని పిలుస్తారని అన్నారు.

పెట్టుబడిదారులను కేవలం అనుమతుల కోసం వచ్చేవారిగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా చూస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. 'స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్' అనే మూడు సూత్రాలతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో క్లస్టర్ ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా వంటి 23 రంగాల్లో ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతిలను ప్రత్యేక ఆర్థిక రీజియన్లుగా తీర్చిదిద్దుతామని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో అమరావతిని కూడా ఉన్నతంగా నిర్మిస్తామని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారని అన్నారు.

గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీపడాల్సిన అవసరం లేదని, కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీని తూర్పు భారతదేశానికి వ్యూహాత్మక గేట్‌వేగా వినియోగించుకోవాలని గుజరాత్ పారిశ్రామికవేత్తలను కోరారు. నవంబర్‌లో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ, 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ గుజరాత్ ప్రతినిధులు, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


Advertisement
Nara Lokesh
Andhra Pradesh Investments
Google AI Hub Visakhapatnam
ArcelorMittal Steel Plant
Speed of Doing Business
CII Partnership Summit

More Telugu News