డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసు: ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న బినామీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసు: ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న బినామీలు

DSP Bheem Reddy Case ACB Raids Reveal Benamis
  • డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల కేసులో బినామీలపై ఏసీబీ దాడులు
  • హైదరాబాద్, జహీరాబాద్‌లలో సోదాలు
  • రూ.400 కోట్ల ఆస్తుల ఆధారాలు సేకరణ
  • బిల్డర్ ఇంట్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ స్వాధీనం
  • మాజీ హోంగార్డు, ఆడిటర్ కార్యాలయాల్లో కీలక పత్రాల సీజ్
  • ఏసీబీ రాకతో విల్లా అమ్మిన వ్యక్తి  పరారీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆయన బినామీలే లక్ష్యంగా ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో పంజా విసిరారు. హైదరాబాద్, జహీరాబాద్‌లలోని పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, రూ.400 కోట్ల ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించారు.

పుప్పాలగూడలో ఉండే బిల్డర్ వీరబొమ్మ వెంకటేష్ ఇంట్లో జరిపిన సోదాల్లో అధికారులు రూ.1.35 కోట్ల నగదుతో పాటు విదేశీ కరెన్సీ, 14 విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. భీమ్‌రెడ్డి తరఫున నిర్మాణ రంగంలో వెంకటేష్ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. గతంలో టోలిచౌకిలో బియ్యం వ్యాపారం చేసిన ఆయన.. భీమ్‌రెడ్డితో పరిచయం తర్వాత కోటీశ్వరుడిగా మారిన తీరుపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు, జహీరాబాద్‌లో భీమ్‌రెడ్డి ఆస్తులను చూసుకుంటున్న మాజీ హోంగార్డు లక్ష్మణ్ నాయక్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పటాన్‌చెరులో భీమ్‌రెడ్డి వద్ద హోంగార్డుగా పనిచేసిన లక్ష్మణ్, ఆ తర్వాత ఉద్యోగం మానేసి బంగారు నగల దుకాణం పెట్టి ధనవంతుడిగా మారినట్లు గుర్తించారు. భీమ్‌రెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్ కార్యాలయంలోనూ డిజిటల్ ఆధారాలను సేకరించారు.

ఈ కేసులో మరో కీలక వ్యక్తి, భీమ్‌రెడ్డికి ఇబ్రహీంబాగ్‌లో విల్లా అమ్మిన మాధవరావు.. ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలిసి మార్నింగ్ వాక్ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పరారయ్యారు. భీమ్‌రెడ్డి అరెస్ట్ తర్వాత పలువురు బినామీలు తమ ఫోన్లను ధ్వంసం చేసి సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేసినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం కొందరి విచారణ మాత్రమే పూర్తికాగా, ఈ కేసులో మరికొంతమందిపై నిఘా పెట్టినట్లు సమాచారం.
Advertisement
Bheem Reddy
ACB Raids Hyderabad
Disproportionate Assets Case
Veera Bomma Venkatesh
Telangana Police Corruption
Zahirabad Benami Assets

More Telugu News