కోటీశ్వరులతో కిక్కిరిసిపోతున్న చంచల్‌గూడ జైలు!

కోటీశ్వరులతో కిక్కిరిసిపోతున్న చంచల్‌గూడ జైలు!

Chanchalguda Jail crowded with millionaires
  • ఏసీబీకి చిక్కుతున్న వందల కోట్ల అవినీతి తిమింగలాలు
  • ఇటీవల నిమ్స్ అధికారి సహా పలువురు అరెస్ట్
  • లంచం, అక్రమాస్తుల కేసుల్లో పెరుగుతున్న అరెస్టులు
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ఇప్పుడు 'కోటీశ్వరుల జైలు'గా మారిపోయింది. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టి, అవినీతికి పాల్పడి ఏసీబీకి పట్టుబడుతున్న బడా అధికారులు ఇప్పుడు ఈ జైలుకే చేరుతున్నారు. దీంతో ఒకప్పుడు సాధారణ ఖైదీలతో ఉండే ఈ జైలు, ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులున్న వారితో నిండిపోతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా, నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ ఆదాయానికి మించి రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలుకు చేరారు. కొన్ని రోజుల క్రితమే డీఎస్పీ భీంరెడ్డి కూడా వంద కోట్లకు పైగా అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి ఇక్కడికే వచ్చారు. వీరే కాకుండా, ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు సైతం రూ.100 కోట్లకు పైగా ఆస్తుల కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు. ఇలా పోలీసు, రెవెన్యూ, వైద్య, ఇంజనీరింగ్ వంటి పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఏసీబీ వలలో చిక్కి చంచల్‌గూడ జైలుకు చేరుతున్నారు.

అవినీతి కేసుల్లో ప్రధానంగా రెండు రకాలుగా అధికారులు పట్టుబడుతున్నారు. ఒకటి, చేయాల్సిన పనికి నేరుగా లంచం డిమాండ్ చేయడం. రెండోది, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం. ఈ రెండు కేసుల్లోనూ పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, వారందరికీ చంచల్‌గూడ జైలు తాత్కాలిక నివాసంగా మారుతోంది.

ఓ విచిత్రమైన ఘటనలో, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్-జైలులో డిప్యూటీ జైలర్‌గా పనిచేసిన దేవేందర్, ఓ ఖైదీ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గంటల వ్యవధిలోనే.. అధికారిగా పనిచేసిన అదే జైలులో ఆయన ఖైదీగా మారాల్సి వచ్చింది. ఒకప్పుడు అధికారం, విలాసవంతమైన జీవితం గడిపిన ఈ అధికారులు.. ఇప్పుడు జైలు గోడల మధ్య విచారణ ఖైదీలుగా కాలం గడుపుతున్నారు.
Advertisement
Chanchalguda Jail
ACB Hyderabad
Corrupt officials arrested
Illegal assets case
NIMS Lakshmi Bhaskar
Telangana ACB raids

More Telugu News